వడదెబ్బతో ఒక్కరోజే 40 మంది మృతి, ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!!
ఎండ ప్రచండంగా మారింది. భానుడి దెబ్బకు తెలుగు రాష్ట్రాలు ఉడికిపోతున్నాయి. వడదెబ్బకు పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. భానుడి ప్రతాపంతో రాష్ట్రం భగ్గుమంటోంది.. మునుపెన్నడూ లేని విధంగా వడగాలులు వీస్తుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. వరుసగా రెండో రోజూ వడదెబ్బతో 30కిపైగానే మరణాలు చోటుచేసుకున్నాయి. శనివారం వడదెబ్బకు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో వృద్ధులు, కూలీలే ఎక్కువగా ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైనే ఎండలు కాశాయి. ఆసిఫాబాద్ జిల్లాలో కుంచవెళ్లి, కాగజ్‌నగర్‌లో 46.4, జగిత్యాల జిల్లా ధర్మపురి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 46.3, ఖమ్మం రూరల్, అదే జిల్లా వైరా, మంచిర్యాల జిల్లా తాండూర్‌లో 46.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. దానికి తగ్గట్టుగా గ్రేటర్ పరిధిలో రికార్డు స్థాయిలో 4,782 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ నమోదైంది. రోజువారీ విద్యుత్తు వినియోగం 101.07 మిలియన్ యూనిట్లుగా రికార్డయింది. వడదెబ్బతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 19 మంది మృత్యువాత పడగా.. ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, ఖమ్మంలో ఆరుగురి చొప్పున, ఆదిలాబాద్‌లో ఇద్దరు, నిజామాబాద్‌లో ఒకరు మరణించారు. ఎండ వేడితో మూగజీవాలు సైతం ఉక్కిరిబిక్కిరవుతున్నాయి.

ఎండ తీవ్రతకు హనుమకొండ బాలసముద్రంలోని సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్లు వేడెక్కకుండా వాటిపై విద్యుత్తు సిబ్బంది గోనె సంచి పట్టాలు కప్పి నీళ్లు చల్లారు. వచ్చే మూడు రోజుల పాటు ఐదారు జిల్లాలను మినహాయిస్తే.. అన్నిచోట్లా 40-42 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఆది, సోమవారాల్లో కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాలు వీస్తాయని పేర్కొంది. అలాగే ఆది, సోమవారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.













Click it and Unblock the Notifications