హైదరాబాద్‌లో భారీ వర్షం, రోడ్లు జలమయం: మరో 3 రోజులూ వర్షాలే
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట, కొండాపూర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట, నిజాంపేట, మాదాపూర్, మేడ్చల్, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గండి మైసమ్మ, మల్లంపేట్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి.
మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతంలోనూ భారీవర్షం పడింది. ఫలితంగా రహదారులపైకి భారీగా వాన నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు ఏర్పడ్డారు. ఆఫీసులు వదిలే సమయం కావడంతో రద్దీ పెరిగింది. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ కింద వరదనీరు భారీగా చేరడంతో ట్రాఫిక్ పోలీసులు రాకపోకలు నిలిపివేశారు.

గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వస్తున్న వాహనాలను నల్లగండ్ల ఫ్లైఓవర్ వైపు మళ్లించారు. రహదారులపై వర్షపునీరు ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టలోనూ భారీ వర్షం కురిసింది. వరదనీరు రోడ్లపైకి చేరడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి.
Powerfull Rain Spell here in #Khajaguda Circle🌩️..,Zero Visibility😳#Hyderabadrains pic.twitter.com/hBHAsjbmQR
— Hyderabad Rains (@Hyderabadrains) November 1, 2024
మూడు రోజులపాటు వర్షాలు
తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దక్షిణ ఏపీ తీరంలో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని వెల్లడించింది.
మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాపల్లి, ములుగు, మహమూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్క వానలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. నవంబర్ 4 వరకు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపింది.












Click it and Unblock the Notifications