హైదరాబాద్‌కు మళ్లీ హెచ్చరికలు- తెలంగాణలో ఇంకో మూడు రోజులూ
హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ప్రత్యేకించి- తెలంగాణపై దీని తీవ్రత అధికంగా ఉంటోంది. హైదరాబాద్‌ను ఇప్పటికే అతి భారీ వర్షం ముంచెత్తింది. మరో మూడు రోజుల పాటు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
బంగాళాఖాతం వాయవ్య దిశలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ దక్షిణ ప్రాంతాల మీదుగా విస్తరించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణలో మరో మూడు రోజుల పాటు అంటే 8వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ములుగు, ఖమ్మం, నల్లగొండ, జయశంకర్-భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, భదాద్రి కొత్తగూడెం, వికారాబాద్, వనపర్తి, కొమురంభీం ఆసిఫాబాద్, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.

హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో తెలంగాణ అతలాకుతలమైంది. రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాలను అప్రమత్తం చేశారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండాముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్య, నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రత్యేక శిబిరాలను నెలకొల్పాలని సూచించారు.












Click it and Unblock the Notifications