భార్యను భుజాలమీద ఎత్తుకొని తిరుమల కొండెక్కిన భర్త.. వీడియో వైరల్; షాకయ్యే విషయం ఏమిటంటే!!
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఒక భర్త భార్యను భుజాలపై ఎత్తుకొని మెట్ల మార్గంలో నడవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. భార్యను భుజాలపై ఎత్తుకుని తిరుమల కొండ ఎక్కిన భర్త వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తిరుమల కొండ ఎత్తుకుని ఎక్కమని భార్య భర్తకు సవాల్
తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపు లంకకు చెందిన లారీ ట్రాన్స్ పోర్ట్ యజమాని వరదా వీరవెంకట సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు, లావణ్య దంపతులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. కాలినడకన మెట్లెక్కి వస్తామని మొక్కుకోవడంతో, కాలినడకనే భార్యాభర్తలిద్దరూ తిరుమల మెట్లు ఎక్కుతున్నారు. అయితే గబగబా మెట్లెక్కుతూ ముందు వెళ్ళిపోతున్న సత్తిబాబు చూసి భార్య లావణ్య, ఒక్కడివే అలా పరిగెత్తడం కాదు దమ్ముంటే నన్ను ఎత్తుకుని ఎక్కుతావా అంటూ సరదాగా సవాల్ చేసింది.

ఏకంగా 70 మెట్లు భార్యని ఎత్తుకొని ఎక్కిన భర్త
ఇంకేం.. భార్య సవాల్ ను నిజంగానే సీరియస్ గా తీసుకున్న భర్త భార్యను భుజాలపైకి ఎక్కించుకొని మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 మెట్లు భార్యని ఎత్తుకొని ఎక్కేసాడు. ఇక ఈ జంట వెళుతున్న తీరు చూసి మెట్లు ఎక్కుతున్న మిగతా భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. సత్తిబాబు లావణ్య దంపతుల పెద్ద అల్లుడు గురుదత్తకు మంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగం వస్తే తిరుమల స్వామి సన్నిధికి నడిచి వస్తావని ఈ జంట అనుకున్నారట. దీంతోనే ఈ జంట శ్రీవారి సన్నిధికి నడిచి మెట్ల మార్గంలో వెళ్లారు.

భార్యను భర్త ఎత్తుకొని తిరుమల కొండ ఎక్కటంపై అందరి దృష్టి
అయితే భార్యను భర్త ఎత్తుకొని తిరుమల కొండ ఎక్కటం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో చాలామంది ఫోన్ లో ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు పోటీపడ్డారు. ఈ జంటను చూసిన వారంతా కొత్తగా పెళ్లి చేసుకున్న జంట అని అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. ఈ జంట పెళ్లి అయి 24 సంవత్సరాలు. వీరికి ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళు కూడా చేసి తాత, అమ్మమ్మలయ్యారు. అయినా కూడా పెళ్లయిన కొత్త జంట లాగా హుషారుగా భార్యను ఎత్తుకొని భర్త తిరుమల కొండ ఎక్కిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
పెళ్లి అయిన 24 సంవత్సరాల తర్వాత భార్యా భర్తల మధ్య సరదా
పెళ్లయిన కొత్తలో ఇట్లాంటి ప్రేమలు ఉంటాయని అనుకుంటాం. కానీ పెళ్లి అయిన 24 సంవత్సరాల తర్వాత కూడా ఆ భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ, వారి మధ్య ఉన్న సరదా చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక ఈ వీడియో చూసిన చాలామంది భార్యలు తమను ఎత్తు కోవాలని భర్తలను కోరుతున్నారట. మరి శారీరకంగా దృఢంగా లేకుండా సత్తిబాబుని చూసి ఎవరూ అలా ఫాలో అయిపోకండి. నడవగలిగిన శక్తి, బరువు మోయగలిగిన దమ్ము రెండూ ఉంటేనే సత్తిబాబులాగా సాహసం చేయాలి. కాదంటారా!!












Click it and Unblock the Notifications