ప్రేమ వివాహం: కూతురి పట్ల తల్లిదండ్రులే కర్కశంగా వ్యవహరిస్తున్నారు
హైదరాబాద్: గర్భవతిగా ఉన్న తన భార్యను ఆమె తల్లిదండ్రులే కిడ్నాప్ చేసి గుర్తు తెలియని ప్రదేశంలో నిర్భంధించారని ఓ వ్యక్తి బుధవారం రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. అంతేకాదు భార్య గర్భాన్ని తీయించే ప్రయత్నం కూడా చేస్తున్నారని వాపోయాడు.
తామిద్దరం ప్రేమ వివాహం చేసుకున్నందుకే అత్తింటివారు కక్షగట్టి విడగొట్టాలని చూస్తున్నారని హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే... కరీంనగర్ జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి గ్రామానికి చెందిన తీగల వెంకటేష్, అదే జిల్లా జమ్మికుంట మండలం సీతంపేట గ్రామానికి చెందిన లక్ష్మి ఇద్దరూ ప్రేమించుకున్నారు.
గత మే నెలలో హైదరాబాద్‌లోని బల్కంపేట వద్దగల ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం తాను కళ్యాణితో నగరంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటూ బీఎంఎస్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపాడు.
ఈ క్రమంలో కళ్యాణి మూడు నెలల గర్భం దాల్చిందని చెప్పాడు. అయితే.. ఇటీవల 'మా మామ నా భార్య కళ్యాణికి ఫోన్ చేసి మీ అమ్మ ఆరోగ్యం బాగాలేదని, చివరిచూపులో ఉందని, నిన్ను ఒకసారి చూడాలని ప్రాధేయపడగా తల్లిమీద ఉన్న మమకారంతో కళ్యాణిని తీసుకొని మా అత్తగారింటికి వెళ్లానని' వెంకటేష్ తెలిపాడు.

అక్కడికెళ్లి చూసేసరికి అత్తమామలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. అయితే.. తొలి ఏకాదశి వస్తుండటంతో కళ్యాణిని అత్తవారింట్లోనే వది లేసి నగరానికి వచ్చానని, రెండు రోజులు గడిచిన తర్వాత తిరిగి అత్తవారింటికి వెళ్లేసరికి వారి ఇంటికి తాళం వేసి ఉందని, తన భార్య ఫోన్‌కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉందని కరీంనగర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.
మరో రెండు రోజుల తర్వాత తన భార్య కళ్యాణి తనకు ఫోన్ చేసి తనను ఏదో తెలియని ప్రదేశంలో గృహనిర్బంధం చేశారని, గర్భాన్ని తీసివేసి, వేరే వివాహం చేయడానికి తన తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారని తెలిపిందని వాపోయాడు. దీంతో తన భార్య ప్రాణాలకు హాని ఉందని ఆవేదన చెందాడు.
ఆమెకు రక్షణ కల్పించాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించి పిర్యాదు చేశానని వెంకటేష్ తెలిపాడు. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్సీ కరీంనగర్ జిల్లా ఎస్పీకి సెప్టెంబర్ 21వ తేదీలో నివేదికను అందజేయాలని నోటీసులు జారీ చేసిందని వెంకటేష్ వివరించాడు.












Click it and Unblock the Notifications