Huzurabad by-poll: ఓటేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్; పోలింగ్ కేంద్రాల వద్ద కౌశిక్ రెడ్డికి చేదు అనుభవం!!
హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా హుజురాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల బరిలోకి దిగిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి హిమ్మత్ నగర్ లోని పోలింగ్ బూత్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. హుజురాబాద్ ప్రజలు మార్పుకు నాంది పలకాలని టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి చేదు అనుభవం..
హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ప్రజలు చైతన్యవంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు హుజూరాబాద్ నియోజకవర్గం లో 33.30 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఇదిలా ఉంటే హుజూరాబాద్ నియోజకవర్గం లోని ఘన్ముక్ల గ్రామంలో టిఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి నీ బిజెపి నేతలు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఆయనను బిజెపి నాయకులు నిలదీశారు. స్థానికేతరులకు ఇక్కడ ఏం పని అంటూ కౌశిక్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలింగ్ కేంద్రాల వద్ద అడ్డగింత
ఈ క్రమంలో బిజెపి టిఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళం నెలకొంది. పోలీసులు అక్కడి నుంచి పాడి కౌశిక్ రెడ్డి ని పంపించివేయడంతో ఉద్రిక్తత చల్లారింది. ఇక వీణవంక లోనూ పోలింగ్ కేంద్రాల వద్ద టిఆర్ఎస్ పార్టీ నేత కౌశిక్ రెడ్డి కి ఇబ్బందులు తప్పలేదు. వీణవంక పోలింగ్ కేంద్రం వద్ద కూడా కౌశిక్ రెడ్డిని స్థానికేతరుడు అన్నఅంశంతో అడ్డుకున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నేత కౌశిక్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.

తాను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా ఉన్నానన్న పాడి కౌశిక్ రెడ్డి .. తనను అడ్డుకోవటంపై ఆగ్రహం
టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి తాను టిఆర్ఎస్ పార్టీ నుంచి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా ఉన్నానని తనకు పోలింగ్ బూతుల వద్దకు వెళ్ళే అధికారం ఉందని కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. బిజెపి నాయకులు ఎలా తనను అడ్డుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. కేవలం ఓడిపోతామనే ప్రస్టేషన్ లో ఉన్న బిజెపి నాయకులు ఇలా ప్రవర్తిస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలకు ప్రజలు కచ్చితంగా ఓటుతో బుద్ధి చెబుతారని కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ పోలింగ్ బూత్ కైనా తాను వెళ్లవచ్చని, 305 పోలింగ్ కేంద్రాలలో ఎక్కడికైనా వెళ్లే హక్కు తనకుందని కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. కేవలం తాను పోలింగ్ బూత్లను సందర్శిస్తున్నానని, కానీ తాను టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నట్లుగా బీజేపీ నేతలు చిత్రీకరిస్తున్నారు అంటూ కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొనసాగుతున్న పోలింగ్.. జమ్మికుంటలో ఉద్రిక్తత, వీణవంకలో ఆందోళన
ఇదిలా ఉంటే హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. వీణవంక మండలం చల్లూరు లో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. మార్కెట్ చైర్మన్ ఇంట్లో డబ్బులు పంచుతున్నారు అని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. దీంతో బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇదిలా ఉంటే జమ్మికుంటలో టీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి .దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. మరోపక్క హుజురాబాద్లో సీఈవో శశాంక్ గోయల్ పర్యటిస్తున్నారు. ఆయన హుజురాబాద్ లో పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూ అధికారులకు, పోలీసులకు తగిన సూచనలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications