హుజురాబాద్ ఫలితాలు: కేసీఆర్ కు దళితబందు షాక్; ఆ గ్రామంలో బీజేపీ ఆధిక్యత, నాల్గవ రౌండ్ లోనూ ఈటల దూకుడు
హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు తలపడిన హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలలో టిఆర్ఎస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటివరకు కౌంటింగ్ కొనసాగిన నాలుగు రౌండ్లోనూ బిజెపి ఆధిక్యతను కనబరుస్తూ వచ్చింది. అయితే స్వల్ప ఆధిక్యాన్ని మాత్రమే బిజెపి కనబరుస్తున్న నేపథ్యంలో కాస్త పార్టీ శ్రేణులలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకా కౌంటింగ్ రౌండ్స్ ఉన్న నేపధ్యంలో ఏ రౌండ్ లో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు అన్ని రౌండ్స్ లోనూ బీజేపీ ఆధిక్యం కొనసాగుతుండటంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తుంది.

కేసీఆర్ కు షాక్ ఇచ్చిన దళిత బంధు
ఇక టీఆర్ఎస్ పార్టీకి ఆది నుండి ప్రతికూల ఫలితాలు రావడం పెద్ద షాక్ గా మారింది.
హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చిన దళిత బంధు పథకం టీఆర్ఎస్ పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో లబ్ధి చేకూర్చ లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. దళిత ఓటు బ్యాంకును కొల్లగొట్టడం కోసం సీఎం కేసీఆర్ దళితులకు దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చాడని, దళితుల పట్ల సీఎం కేసీఆర్ కు ఎటువంటి ప్రేమ లేదని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయం అని బిజెపి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే టీఆర్ఎస్ పార్టీ మాత్రం దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేసింది.

దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన గ్రామంలో టీఆర్ఎస్ కు ఆదరణ కరువు
దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన అధికార టీఆర్ఎస్, ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని భావించింది. ఈ పథకం ద్వారా దళిత ఓటు బ్యాంకు తమకు వస్తుందని ఆశించింది. ఈ పథకాన్ని ముందుగా ఉప ఎన్నికలు జరుగుతున్న హుజురాబాద్ నుంచి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అయినప్పటికీ హుజురాబాద్ నియోజకవర్గ ఓటర్ల టిఆర్ఎస్ పార్టీని ఆదరించలేదు. దళిత బందు పథకాన్ని ప్రారంభించిన గ్రామమే కేసీఆర్ కి బిగ్ షాక్ ఇచ్చింది.

శాలపల్లి గ్రామంలో బీజేపీ లీడ్ .. డైజెస్ట్ చేసుకోలేకపోతున్న టీఆర్ఎస్ నేతలు
అయినప్పటికీ ఈ ఎన్నికల ఫలితాలలో దళిత బంధు పథకం కూడా వర్కౌట్ కాలేదన్నది స్పష్టంగా తెలుస్తుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన శాలపల్లి లోనూ బిజెపి 135 ఓట్ల ఆధిక్యతను కనబరిచింది. శాలపల్లి గ్రామంలో బిజెపికి 311 ఓట్లు రాగా టిఆర్ఎస్ కు 182 ఓట్లు వచ్చాయి. ఊహించని ఈ పరిణామానికి టీఆర్ఎస్ పార్టీ నేతలు షాక్ తిన్నారు. ఓటర్ల తీర్పు అధికార పార్టీకి ప్రతికూలంగా వస్తుండటం టీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు.

నాల్గవ రౌండ్ ముగిసే సరికి 1825 ఓట్ల ఆధిక్యత
ఇదిలా ఉంటే ప్రస్తుతం నాలుగో రౌండ్లో బిజెపి ఆధిక్యాన్ని కనబరిచింది. ఈరోజు హుజూరాబాద్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన సమయం నుండి మొదటి రౌండ్ కౌంటింగ్ నుండి బిజెపి క్రమంగా ఆధిక్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. 3వ రౌండ్ లెక్కింపులో ఈటెల 1269 ఓట్ల ఆధిక్యతను కనబరిచారు. ఇక నాలుగవ రౌండ్ కౌంటింగ్ లోనూ టిఆర్ఎస్ పార్టీ కి షాక్ ఇస్తూ బిజెపి దూసుకుపోయింది. మొత్తంగా ప్రస్తుతం నాల్గవ రౌండ్ ముగిసేసరికి బీజేపీ లీడింగ్ 1825 గా ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా బీజేపీ కే అనుకూలంగా వచ్చిన నేపధ్యంలో బీజేపీ ఇప్పుడు ఆధిక్యాన్ని కొనసాగించటంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతున్నాయని చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications