అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్: బండి సంజయ్ చెప్పిందే నిజం కాబోతుందని చర్చ; హుజురాబాద్ రిజల్ట్ తో బీజేపీలో జోష్!!
బిజెపి రథసారథిగా బండి సంజయ్ పగ్గాలు చేపట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో దూకుడు కొనసాగిస్తోంది. దుబ్బాక ఎన్నికల్లో దుమ్ముదులిపిన బిజెపి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిజెపి తనదైన శైలిలో దూసుకుపోతోంది. బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన ఈటల రాజేందర్ సమీప ప్రత్యర్థి టిఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. కౌంటింగ్ సరళి బిజెపి శ్రేణులకు మంచి జోష్ ఇస్తోంది. కౌంటింగ్ మొదలైన మొదటి రౌండ్ నుండి బిజెపి తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటి వరకు అన్ని రౌండ్ల లోనూ బిజెపి ముందు వరుసలో నిలిచింది.

హుజురాబాద్ ఎన్నికలకు ముందు బండి సంజయ్ అంచనా .. అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ కాంబినేషన్
ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గతంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది .హుజురాబాద్ ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఉద్యమకారుడు ఈటల రాజేందర్ ను గెలిపించాలని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసిన బండి సంజయ్ హుజరాబాద్ లో రాజేందర్ గెలిచిన తర్వాత అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ కాంబినేషన్ ప్రజాగళం వినిపిస్తారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికార పార్టీపై ఒత్తిడి తెస్తారని వ్యాఖ్యానించారు. హుజురాబాద్ లో ఈటల గెలిస్తే కెసిఆర్ పదవికి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ చేసిన బండి సంజయ్ ఆర్ఆర్ ఫార్ములా గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు.

రాజాసింగ్, రఘునందన్ రావు, రాజేందర్ లపై బండి సంజయ్
బిజెపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్, దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన రఘునందన్ రావు, ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గం నుండి రాజేందర్ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ కరెన్సీని గెలిపిస్తారా ? కాషాయ జెండా ను గెలిపిస్తారా అని ప్రశ్నించిన బండి సంజయ్ కాషాయ జెండా గెలిస్తే ప్రజా పోరాటం చేస్తుందని వెల్లడించారు. బిజెపి నుండి బరిలోకి దిగిన ఈటల రాజేందర్ గెలిస్తే ప్రజల పక్షాన నిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ అహంకారానికి హుజురాబాద్ ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ఆర్ఆర్ఆర్ త్రయంపై బండి సంజయ్ వ్యాఖ్యలు నిజం అవుతున్నాయన్న చర్చ
ఆర్ఆర్ఆర్ త్రయం ప్రజా సమస్యల కోసం అసెంబ్లీ వేదికగా పోరాటం చేస్తారని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు బండి సంజయ్ చెప్పిందే నిజమవుతుందని అటు పార్టీ వర్గాలలోనూ, ప్రజలలోనూ చర్చ జరుగుతుంది. బండి సంజయ్ అంచనా తప్పలేదని ఈటల రాజేందర్ విజయం సాధించవచ్చునని బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుండి పార్టీ తెలంగాణలో గణనీయంగా పుంజుకుందని ఆసక్తికర చర్చ జరుగుతుంది. బండి సంజయ్ నాయకత్వంపైన పార్టీ శ్రేణులు బలమైన విశ్వాసం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

ఈటల అసెంబ్లీకి వెళ్ళటం ఖాయం అన్న బండి సంజయ్
హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యాన్ని చూపిస్తున్న క్రమంలో మాట్లాడిన బండి సంజయ్ కూడా అసెంబ్లీకి ఈటెల రాజేందర్ వెళుతున్నాడు అంటూ స్పష్టం చేశారు. కెసిఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈటల రాజేందర్ విజయం సాధించడం ఖాయమని, అసెంబ్లీలో అడుగు పెట్టటం ఖాయమని తేల్చి చెప్పారు. ఏది ఏమైనా స్పష్టమైన అంచనాలతో ముందుకు సాగుతున్న బిజెపి రథసారధి బండి సంజయ్ చెప్పిందే జరుగుతుందని బిజెపి నేతలలో అంతర్గత చర్చ జరుగుతుంది. బండి సంజయ్ నాయకత్వంపై పార్టీ నాయకుల్లో గురి పెరిగింది. ఈ దూకుడు ఇలాగే ఉంటే రానున్న ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతుంది.

10రౌండ్లు ముగిసే సరికి 5,631 ఓట్ల ఆధిక్యత
ఇదిలా ఉంటే హుజరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఇప్పటి వరకూ జరిగిన పది రౌండ్లలో ఆధిక్యాన్ని కొనసాగించారు. పదవ రౌండ్లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ కు 4,235 ఓట్లు పోల్ కాగా, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 3,709 ఓట్లు పోలయ్యాయి .దీంతో బీజేపీకి ఇప్పటివరకు నమోదైన మొత్తం ఓట్లు 44,647 కాగా టిఆర్ఎస్ పార్టీకి 39,016 ఓట్లు పోల్ అయ్యాయి. పదవ రౌండ్లో బిజెపికి 526 ఓట్లు అదనంగా వచ్చాయి. ఇప్పటివరకు బీజేపీ మొత్తంగా 5,631 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications