హుజురాబాద్ ఫలితాలు: కేసీఆర్ అభివృద్ధి మంత్రమే టీఆర్ఎస్ కు బూమరాంగ్; పని చేసిన ఈటల ఆత్మగౌరవ నినాదం!!
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉండటం టీఆర్ఎస్ కు షాక్ గా మారింది. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన సమయం నుండి ఇప్పటివరకు అన్ని రౌండ్స్ లోనూ బిజెపి ఆధిక్యాన్ని కొనసాగించింది. ఈ ఎన్నికలు సీఎం కేసీఆర్ అహంకారానికి,హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఎన్నికలని బిజెపి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. తాజాగా బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఆత్మగౌరవ నినాదం పనిచేసిందా ? సీఎం కేసీఆర్ అభివృద్ధి మంత్రము ఆయనకు బూమరాంగ్ అయిందా? అన్న చర్చ స్థానికంగా జరుగుతుంది.

ఆత్మ గౌరవ నినాదంతో హుజురాబాద్ ప్రచారం సాగించిన ఈటల
ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో బలమైన నేత. మొదటినుంచి ప్రజాబలం ఉన్న నేత. టిఆర్ఎస్ పార్టీ నుండి ఈటల రాజేందర్ ను అవమానకర రీతిలో బయటకు పంపించిన తర్వాత ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలు వచ్చాయి. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలో ఈటల రాజేందర్ బిజెపి నుండి బరిలోకి దిగి, ఆత్మ గౌరవ నినాదంతో ప్రచార పర్వాన్ని కొనసాగించారు. సీఎం కేసీఆర్ అహంకారి అంటూ పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవానికి కెసిఆర్ నిర్ణయాలు గొడ్డలిపెట్టుగా మారాయని ఈటల రాజేందర్ తనదైన శైలిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు.

ఈటల చెక్ పెట్టటం కోసం అభివృద్ధి మంత్రం జపించిన కేసీఆర్
ఇక ఈటల రాజేందర్ కు చెక్ పెట్టాలని భావించిన సీఎం కేసీఆర్ హుజరాబాద్ నియోజకవర్గానికి నిధుల వరద కురిపించారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఎవరూ ఊహించనంతగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అద్దంలా తీర్చిదిద్దారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కంకణబద్ధులై ఉన్న టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈటల రాజేందర్ తాను రాజీనామా చేయడం వల్ల హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక వచ్చిందని, తన రాజీనామా వల్ల హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, నియోజకవర్గ అభివృద్ధి క్రెడిట్ తనదేనని ప్రచారం చేశారు.

తన రాజీనామా వల్లే అభివృద్ధి .. క్రెడిట్ తనదే అన్న ఈటల ప్రచారం
తను రాజీనామా చేయకపోతే హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి చెందేది కాదని ఈటల రాజేందర్ ప్రచారం చేసి కేసీఆర్ వ్యూహానికి చెక్ పెట్టారు. ఇక దళిత ఓటు బ్యాంకు కోసం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ పైలట్ ప్రాజెక్ట్ గా హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. శాలపల్లి నుండి దళిత బంధు ప్రారంభించారు. ఇక దళిత బంధు పథకం ద్వారా దళితుల ఓట్లు తమకే పడతాయని భావిస్తే, దళిత బంధు కేవలం ఎన్నికల కోసం తెచ్చిన స్కీం అని, దళితుల పట్ల కేసీఆర్ కు ఎలాంటి ప్రేమ లేదని, దళితుడిని సీఎం చేస్తానని చేశాడా ? అంటూ ఈటల దళిత బంధు విషయంలో రివర్స్ ఎటాక్ చేశారు.

అభివృద్ధికి కారణం అయిన ఈటల వైపే ప్రజల మొగ్గు
అటు టీఆర్ఎస్, బీజేపీ ప్రచారం నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓటేస్తారా? హుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కారణమైన ఈటల రాజేందర్ ను ఆదరిస్తారా అన్న చర్చ జోరుగా సాగింది. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల కౌంటింగ్ హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కారణమైన ఈటల రాజేందర్ ను ప్రజలు ఆదరిస్తున్న ట్లుగా స్పష్టంగా చూపిస్తుంది. నియోజకవర్గ అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్లిన టిఆర్ఎస్ పార్టీకి, గులాబీ బాస్ కు ప్రజలు షాక్ ఇవ్వడం ప్రధానంగా కనిపిస్తుంది.

అభివృద్ధి మంత్రం, విచ్చలవిడి ఖర్చే టీఆర్ఎస్ కు బూమరాంగ్
సీఎం కేసీఆర్ అభివృద్ధి మంత్రమే, విచ్చలవిడిగా ఎన్నికల కోసం పెట్టిన ఖర్చే టిఆర్ఎస్ పార్టీకి బూమరాంగ్ అయిందన్న చర్చ జరుగుతుంది. ఎన్నికలు వస్తే అభివృద్ధి చేస్తారా? లేకపోతే అభివృద్ధి చేయరా అన్న ప్రశ్న కూడా ప్రజల్లో ఉత్పన్నం కావడం, తన వల్లే ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని ఈటల రాజేందర్ చెప్పిన అంశం ప్రజల మనసులో బలంగా నాటుకోవడం వెరసి, టిఆర్ఎస్ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి.

కేసీఆర్ ఎన్నికల వ్యూహాలు పారవన్న సంకేతం ఇచ్చిన హుజురాబాద్ ప్రజలు
ఇది సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం మొత్తం హుజురాబాద్ వైపే చూస్తుంది అన్న ప్రచారం కూడా కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి మైనస్ గా మారింది. రాష్ట్రం దృష్టి హుజురాబాద్ ఉప ఎన్నికపై ఉన్న నేపధ్యంలో కేసీఆర్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చే కంటే ప్రతికూలంగా తీర్పు ఇస్తే ప్రభుత్వ పాలన మెరుగు పడుతుంది అన్న భావన కూడా వ్యక్తం అయ్యిందని సమాచారం. ఇక మంత్రులు, రాష్ట్రంలోని కీలక నాయకులు ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొనటం గతంలో లేని విధంగా ఈ ఎన్నికలు సాగటం వెరసి ఓటర్లు బాగా అలోచించి మరీ ఓటేసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఏ వ్యూహాలతో ముందు వెళతారో, ఇక నుండి ఆ వ్యూహాలు పారవన్న సంకేతాన్ని హుజురాబాద్ నియోజక వర్గ ప్రజలు ఇచ్చారు.

వర్కవుట్ అయిన ఆత్మగౌరవ నినాదం
కౌంటింగ్ కొనసాగిన అన్ని రౌండ్లోనూ బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తుండడం, టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలు అవుతుందేమో అన్న సంకేతాన్ని స్పష్టంగా సూచిస్తుంది. ఏది ఏమైన ఈ ఎన్నిక గులాబీ బాస్ కెసిఆర్ కు గుణపాఠం అని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల్లో చర్చ కొనసాగుతుంది. కెసిఆర్ అహంకారాన్ని తగ్గించడం కోసం, ఓటుతో చెంప చెళ్లుమనిపించమని పిలుపునిచ్చిన బిజెపి హుజురాబాద్ ఆత్మగౌరవ నినాదం బాగా వర్కౌట్ అయింది అన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.












Click it and Unblock the Notifications