అప్సర హత్య కేసులో దోషికి జీవిత ఖైదు
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన అప్సర అనే మహిళ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 2023లో జరిగిన అప్సర హత్య కేసులో దోషికి రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. పెళ్లి చేసుకోవాలని అప్సర అడగడంతో పూజారి వెంకటసాయి కృష్ణ ఆమెను దారుణంగా హత్య చేసిన విషయం విదితమే.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయం కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఆ ప్రేమ వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో 2023 జూన్ 3న కోయంబత్తూరు వెళ్దామని అప్సరను నమ్మించాడు వెంకటసాయి కృష్ణ. విమాన టికెట్లు కొనుగోలు చేశానని చెప్పాడు. నిజమేనని నమ్మిన అప్సర.. లగేజీ సహా ప్రయాణానికి సిద్ధమైంది.

అప్సర వ్యక్తిగత పనిపై కోయంబత్తూరు వెళ్తోందని.. ఆమెను శంషాబాద్ వద్ద దింపివస్తానంటూ ఆమె తల్లికి వెంకటసాయికృష్ణ చెప్పాడు. ఆరోజు రాత్రి 8.15 గంటలకు సాయికృష్ణ, అప్సర కారులో సరూర్‌నగర్ నుంచి బయల్దేరారు. రాత్రి 10 గంటలకు శంషాబాద్ మండలం రాళ్లగూడలోని ఒక హోటల్‌లో భోజనం చేశారు. రాత్రి 11 గంటలకు సుల్తాన్‌పల్లిలోని గోశాల వద్దకు వెళ్లారు. అక్కడే కొంత సేపు గడిపారు. గోశాలలోని బెల్లం దంచే రాయిని ఆమె కంటపడకుండా అతడు కారులోకి చేర్చాడు.
జూన్ 4న తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో గోశాల సమీపంలోని నర్కుడలో ఓ ఖాళీ వెంచర్ వద్దకు చేరారు. ఆమె నిద్రలోకి జారుకోగానే కారు సీటు కవర్‌ను ఆమె ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేశాడు. ఆ తర్వాత బెల్లం దంచే రాయితో ఆమె తల వెనుక భాగంలో పదిసార్లు బలంగా బాదాడు. దీంతో ఆమె మృతి చెందింది. మృతదేహంపై కారు కవర్ కప్పాడు. అక్కడ్నుంచి సరూర్ నగర్‌లోని తన ఇంటిి చేరుకుని, అక్కడే మృతదేహం ఉన్న కారును పార్క్ చేశాడు. ఏమీ తెలియనట్లుగా తనరోజువారీ కార్యక్రమాలు చేసుకుంటున్నాడు.
రెండురోజులపాటు కారులో ఉన్న అప్సర మృతదేహాన్ని కవర్‌లో చుట్టి సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయం సమీపంలోని మ్యాన్ హోల్‌లో పడేశాడు. దుర్వాసన వస్తందంటూ ఎల్బీనగర్ నుంచి అడ్డా ూలీలను పిలిపించి.. రెండు ట్రక్కుల మట్టిని తీసుకొచ్చి మ్యాన్ హోల్‌ను కప్పి సిమెంట్‌తో పూడ్పించాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన కోర్టు వెంకటసాయికృష్ణకు జీవిత ఖైదు శిక్ష తోపాటు రూ. 10 వేల జరిమానా, సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మృతురాలి కుటుంబసభ్యులకు రూ. 10 లక్షల చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కాగా, బాధితురాలు, దోషి ఇద్దరూ కూడా వివాహితులే కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications