హైదరాబాద్ ఐటీ కంపెనీలకు పోలీసుల కీలక సూచన..!!
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇవ్వాళ భారీ వర్షం దంచికొట్టింది. సాయంత్రం ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో వర్షం ముంచెత్తింది. గంటల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలన్నీ స్తంభించిపోయాయి. వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనానికి గురయ్యాయి.
మరో రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో ఇదే పరిస్థితులు ఉంటాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

భారీ వర్షం ధాటికి ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సాయంత్రం వేళ.. తమ కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయారు. ఎటూ కదల్లేని దుస్థితిని ఎదుర్కొన్నారు. ఫ్లైఓవర్లన్నీ ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కుపోయాయి.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మాదాపూర్ జోన్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా నివారణ చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఐటీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు ఒకేసారి బయటికి రాకుండా వేర్వేరు లాగౌట్ సమయాలను ప్రకటించారు.
దీని ప్రకారం- ఐకియా, సైబర్ టవర్ రోడ్, రహేజా మైండ్ స్పేస్‌లల్లో ఉండే కంపెనీలు, టీసీఎస్, హెచ్ఎస్‌బీసీ, డెల్, మాదాపూర్/కొండాపూర్ ప్రాంతాల్లో ఉండే డెల్, ఒరాకిల్, క్వాల్‌కామ్, టెక్ మహీంద్ర, పూర్వ సమ్మిట్, వాటర్ మార్క్‌లల్లో ఉండే అన్ని కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు.. మధ్యాహ్నం 3 గంటలకే తమ విధులను ముగించుకుని ఇళ్లకు బయలుదేరాల్సి ఉంటుంది.

ఇక ఇదే స్ట్రెచ్‌లో ఐకియా, బయో డైవర్సిటీ, రాయదుర్గం ప్రాంతాల్లో ఉండే కంపెనీలు, నాలెడ్జ్ సిటీ, నాలెడ్జ్ పార్క్, టీ-హబ్, గెలాక్సీ, ఎల్టీఐ, ట్విట్జా, కామర్జ్‌జోన్, ఆర్ఎంజెడ్ నెక్సిటీ, స్కై వ్యూ 10 అండ్ 20, దివ్యశ్రీ ఒరియన్, అసెండాస్.. కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు సాయంత్రం 4:30 గంటల కల్లా తమ విధులను ముగించుకుని ఇళ్లకు బయలుదేరి వెళ్లాల్సి ఉంటుంది.
ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలిల్లో ఉండే ఐటీ కంపెనీలు, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, సెంటారస్, బ్రాడ్‌వే, విర్టుసా, బీఎస్ఆర్ ఐటీ పార్క్‌లో ఉండే అన్ని కంపెనీలు, ఐసీఐసీఐ, వేవ్ రాక్‌లో ఉండే అన్ని కంపెనీలు, అమెజాన్, హనీవెల్, హిటాచి, సత్వ కేపిటల్, జీఏఆర్‌లో ఉండే అన్ని కంపెనీలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, క్యూ సిటీలో ఉండే అన్ని కంపెనీలు, డీఎల్‌ఎఫ్‌లో ఉండే అన్ని కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు.. సాయంత్రం 6 గంటల కల్లా తమ విధులను ముగించుకుని ఇళ్లకు బయలుదేరి వెళ్లాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications