అమెరికాలో తెలుగు విద్యార్ధి ఆత్మహత్య: ర్యాంకు రాలేదని మనస్తాపం
హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్ధి తనువు చాలించాడు. వివరాల్లోకి వెళితే అమెరికాలోని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన శివ కిరణ్ బండి అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని రామాంతపూర్‌కు చెందిన శివకరణ్ ఉన్నత విద్యాభ్యాసం కోసం ఏడాది కిందట అమెరికా వెళ్లాడు.
శివ కిరన్ చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేవాడు. ప్రాథమిక విద్యను హఫ్సీగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్‌లో పూర్తి చేశాడు. ఇంటర్ మీడియట్‌ను నారాయణ కళాశాలలో పూర్తిచేశాడు. అనంతరం మెదక్ జిల్లా ఎద్దుమైలారంలోని ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
అనంతరం పలు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినా వాటిని కాదని ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఎంఎస్ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. ఎప్పుడూ చదువులో ముందుండే శివ కిరణ్ తాను అనుకున్న గోల్ సాధించకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అతడి స్నేహితులు చెబుతున్నారు.

మొదటి సెమిస్టర్‌లో మంచి ర్యాంకు సాధించాడు. రెండు రోజుల క్రితం విడుదలైన రెండో సెమిస్టర్ ఫలితాల్లో తాను అనుకున్న ర్యాంక్ రాకపోవడంతో మనస్తాపానికి గురైన శివ కిరణ్ క్యాంపస్‌లోని హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతని తల్లి దండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
శివకిరణ్ మృతిపై తానాకు చెందిన సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. శివకిరణ్ ఎలా చనిపోయాడనే విషయాలు రేపు ఉదయానికి తెలుస్తాయని వివరించారు. ఇక్కడ రాత్రి కావడంతో తెల్లవారుజామున దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తామని చెప్పారు.
ఇప్పటికే భారత్‌లో ఉన్న శివ కిరణ్ బాబాయితో ఫోన్‌లో మాట్లాడటం జరిగిందని తెలిపారు. ఈ విషాదాన్ని శివ కిరణ్ తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆయనకు సూచించామని తెలిపారు. మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా భారత్‌కు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications