ఖమ్మం నడిబొడ్డున కండువా మార్చుకుంటా: పొంగులేటి, కేసీఆర్ సభతో ఉత్కంఠకు తెర!
ఖమ్మం: భారత్ రాష్ట్ర సమితికి దూరమవుతారంటూ ఒకవైపు.. మరోవైపు పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల్లో పర్యటించి ఇటీవల చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను, అనారోగ్యానికి గురైనవారిని పరామర్శించారు. సర్పంచ్ పద్మ, జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్కృష్ణారెడ్డి, జిల్లా లీడర్లు జారె ఆదినారాయణ, మువ్వా విజయబాబు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

పార్టీ మారితే ఖమ్మం నడిబొడ్డున కండువా కప్పుకుంటా: పొంగులేటి
ఈ సందర్బంగా కొందరు కొందరు కార్యకర్తలు మీరు పార్టీ మారుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని.. పొంగులేటి ప్రశ్నించారు. దీనికి స్పందించిన పొంగులేటి.. తాను పార్టీ మారాల్సి వస్తే దొంగచాటుగా కాదు.. ఖమ్మం నడిబొడ్డున లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలోనే కండువా కప్పుకుంటానని స్పష్టం చేశారు. తాను పార్టీ మారితే తనతో పాటు తన కార్యకర్తలంతా కండువాలు కప్పుకునేలా చేస్తానని అన్నారు.

18న కేసీఆర్ సభకు పొంగులేటి వస్తారా?
కాగా, జనవరి 18న ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సభ కోసం బీఆర్ఎస్ ఏర్పాట్లను మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, నేతలు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గంటారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.

కేసీఆర్ సభతో పొంగులేటి సస్పెన్స్‌కు తెరపడనుందా?
శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో పలు కార్యక్రమాలు, సభలు నిర్వహించారు. గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంపై కొంత అసంతృప్తిగా ఉన్న పొంగులేటి.. పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ త్యాగాలు చేయడం కుదరదని అన్నారు. అంతేగాక, తనతోపాటు తన అనుచరులు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సభలో పొంగులేటి పాల్గొంటారా? లేదా? అనేది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ కేసీఆర్ సభలో పొంగులేటి పాల్గొంటే.. ఇక బీఆర్ఎస్ పార్టీలోనే ఆయన కొనసాగుతారని తేలిపోతుంది. లేదంటే.. ఆయన పార్టీ మార్పునకు సంకేతాలిచ్చినట్లే. కాగా, ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. కానీ, మార్పుపై మార్పుపై పొంగులేటి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం












Click it and Unblock the Notifications