అదే జరిగితే కాంగ్రెస్ లో మిగిలేది ఆ ఇద్దరేనా ... రేగా సంచలనం
కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ కి మారుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ తలుపులు తెరిస్తే కాంగ్రెస్ పార్టీలో ఆ ఇద్దరే మిగులుతారు అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. టిఆర్ఎస్ నాయకులు నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను పార్టీ మార్చడం కోసం పని చేస్తే కాంగ్రెస్ పార్టీలో కేవలం మిగిలేది ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టివిక్రమార్క లేనని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
ఇక అంతే కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను కేసీఆర్ మనిషినేనని , టిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు చేరనని, సమయం వచ్చినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే చేరుతా' అని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ వెంట కలిసి నడుస్తానన్న ఆయన మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలపై సీఎం కేసీఆర్‌ను కలుస్తానంటే, వీల్లేదంటూ కాంగ్రెస్ నేతలు ఆంక్షలు పెట్టారని ఆరోపించారు. అయినా వెరవకుండా సాగు నీరు, తాగు నీరు, పోడు భూముల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే లు అని చిన్నచూపు చూడకుండా వెనువెంటనే పరిష్కారానికి ఆదేశించారని చెప్పారు.

ప్రజల సమస్యలు పట్టని కాంగ్రెస్ పార్టీలో ఎన్నాళ్లున్నా ప్రయోజనం ఉండదన్న ఉద్దేశంతోనే కేసీఆర్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
దీనిపై సీఎల్పీ నేత, టీపీసీసీ అధ్యక్షుడు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. 'సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పిలవాల్సిన అవసరమేముంది? అంటూ ప్రశ్నించిన రేగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనాలోచిత నిర్ణయాలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని వారిని నమ్ముకుని ఎంత కాలం పని చేస్తామని ప్రశ్నించారు. తన నిర్ణయాన్ని నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతిస్తున్నారని తెలిపారు. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే 50 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిందని చెప్పిన రేగా , తాజాగా టిఆర్ఎస్ పార్టీ తలుపులు తీసి పిలిస్తే కాంగ్రెస్ పార్టీలో ఆ ఇద్దరే మిగులుతారు అంటూ సంచలన వ్యాఖ్యలతో మరోమారు రాజకీయ దుమారం రేపారు.












Click it and Unblock the Notifications