14 మందితో చేయనిది 16 మందితో చేస్తారా ? గులాబీ దళపతిపై ఉత్తమ్ విసుర్లు
హైదరాబాద్ : ఎన్నికల వేళ అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కోటలు దాటుతోంది. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ ఊపందుకొంది. అధికార టీఆర్ఎస్ పార్టీ వైఖరిని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎండగట్టారు. నల్గొండ జిల్లా త్రిపురారంలో కాంగ్రెస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

అప్పుడు చేయనిది ? ఇప్పుడు చేస్తారా ?
గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది 12 స్థానాలైతే .. ప్రలోభాలకు గురిచేసి గుత్తా సుఖేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకొని 14 మందికి టీఆర్ఎస్ ఎంపీల సంఖ్య చేరింది. 14 మంది ఎంపీలతో చేయనిది 16 మందితో ఏం చేస్తారని ఉత్తమ్ ప్రశ్నించారు. 16 మందిని గెలిపిస్తే ఏదో చేస్తారనే భ్రమను ప్రజలకు కల్పిస్తున్నారని .. ఇన్నాళ్లు రాష్ట్ర ప్రయోజనాలు, సంక్షేమ కార్యక్రమాలు పట్టలేదా అని నిలదీశారు.

రిజర్వేషన్లపై వంచన
ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతామని మాట ఇచ్చి తప్పారని విమర్శించారు. గిరిజనులను కూడా నయవంచన చేశారని మండిపడ్డారు. వారి 12 శాతం రిజర్వేషన్ల అంశాన్ని పెడచెవిన పెట్టారని ఆరోపించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదని మండిపడ్డారు.

విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
విద్య ఉద్యోగాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. రాహుల్ ప్రధాని అయితే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని హామీనిచ్చారు. ఎన్డీఏ, టీఆర్ఎస్ ఎంపీలు చేసిందేమీ లేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications