తెలంగాణపై నీళ్లు గుమ్మరించిన వాతావరణశాఖ
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఏదైనా పని ఉన్నప్పటికీ ఉదయం సమయంలోనే పూర్తిచేసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడిస్తున్నారు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతోపాటు వడగాడ్పులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆది, సోమవారాల్లో కూడా ఎండల తీవ్రత కొనసాగనుంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వడదెబ్బకు ఇద్దరు మరణించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.4 డిగ్రీలు, నల్గొండ జిల్లా మాడుగులపల్లి, ములుగు జిల్లా మంగపేట మండలాల్లో 45.2, ములుగు జిల్లా వాజేడు, జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలాల్లో 45.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగర పరిధిలో మూసాపేటలో 43 డిగ్రీలు, 21 సర్కిళ్లలో 42.1 నుంచి రూ.42.9 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కొత్త గోల్‌తండాకు చెందిన బానోత్ మంగ్యా (40) కూలీ పనులకు వెళ్లొచ్చి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. హన్మకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తికి చెందిన ఎండనూరి రాజు (35) తన అత్తగారి ఊరు భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం దామరంచపల్లికి నడుచుకుంటూ వెళుతుండగా చెన్నాపూర్ వద్ద వడదెబ్బ తిగిలి మృతిచెందాడు. ప్రతి ఒక్కరూ వైద్యుల సలహాలు పాటించాలని, దాహం వేసినా వేయకపోయినా తరుచుగా గొంతు తడుపుకుంటుండాలని, నీరు తాగుతుండాలని సూచిస్తున్నరు. నిమ్మరసం, అల్లం, జిలకర కలిపి చేసిన మజ్జిగ తీసుకుంటే మంచిది.












Click it and Unblock the Notifications