మండుటెండల్లో చల్లని కబురు చెప్పిన ఐఎండీ; త్వరలో వర్షాలు!!
రెండు తెలుగు రాష్ట్రాలలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఈసారి ఎల్ నినో ప్రభావంతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది .ఈసారి వేసవి గత వేసవి కంటే అధిక ఉష్ణోగ్రతలను నమోదు చేస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఎండలు, వదగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
ప్రస్తుతం ఏప్రిల్ నెల ప్రారంభంలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. విపరీతంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో వడగాలులు కూడా ఎక్కువగా వీస్తున్న క్రమంలో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

తీపికబురు చెప్పిన వాతావరణ శాఖ
ఇక ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి ఒక తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో వర్ష సూచన ఉందని, కాస్త ఉష్ణతాపం నుంచి ఉపశమనం దొరుకుతుందని పేర్కొంది. ఏప్రిల్ ఆరవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని, 7, 8 తేదీలలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఆ తేదీలలో వర్షాలు కురిసే అవకాశం
హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా బులిటెన్ లో ఏప్రిల్ 7, 8 తేదీలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో 41 డిగ్రీల నుండి 42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
హైదరాబాద్ లో మండుతున్న ఎండలు.. నిర్మానుష్యంగా రోడ్లు
సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడంతో పాటుగా వడగాలులు వీస్తున్న క్రమంలో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఇక చాలావరకు ఎండ సమయంలో రోడ్లు నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. నిన్న అత్యధికంగా మూసాపేటలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత, చందానగర్, ఖైరతాబాద్ లలో 41.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications