Weather Report: రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి.. ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు..
రాష్ట్రాన్ని చలి పులి వణికిస్తుంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్నాయి. చలి తీవ్రత బాగా పెరిగడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం 5 గంటలకే మొదలవుతున్న చలి ఉదయం 9 గంటలు దాటినా తగ్గడం లేదు. గురువారం రాత్రి చలి తీవ్రత పెరిగింది. శుక్రవారం ఉదయం 9 గంటల వరకు మబ్బులు కమ్మాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్లే చలితో ఇబ్బంది పడ్డారు. దీంతో రోడ్లపై వాహనాల రాకపోకలు నెమ్మదించాయి.

7 డిగ్రీలు
ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. చలి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పింది. కాగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ సహా పలు జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 7 డిగ్రీలుగా నమోదు కాగా.. నిర్మల్ జిల్లాలో 7.7 డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది. కొమురం భీం జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 8.2 డిగ్రీలుగా నమోదు అయింది.

6.6 డిగ్రీలు
మంచిర్యాల జిల్లాలో 9.6గా నమోదు కాగా.. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాపై చలి పంజా విసిరుతోంది. సింగిల్ డిజిట్ కి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ లో 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అన్నసాగర్ లో 8, సిర్గాపూర్ లో 8.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా హబ్సిపూర్ లో 7.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. మెదక్ జిల్లా చిట్కుల్ లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

నేరడిగొండ
నిన్న గురువారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 10.3 డిగ్రీలు, కొమురంభీం జిల్లా సిర్పూర్‌లో 10.6 డిగ్రీలు, కెరిమెరిలో 10.7 డిగ్రీలు, ఉట్నూర్‌లో 10.8 డిగ్రీలు, బోరాజ్‌లో 11.1 డిగ్రీలు, తిర్యానీలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లాలో 11.2 డిగ్రీలు నమోదైంది. దీంతో ఉదయం కూలీ పనులకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్
ఇటు హైదరాబాద్ లోనూ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డిలో రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వృద్ధులు, చిన్న పిల్లలు, ఆస్తమా రోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.