భారతదేశంలో రెండవ అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
తెలంగాణా రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ SC స్థానంలో ఈసారి జరుగుతున్న ఎన్నిక పలు కారణాలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ దేశంలోనే రెండో అతిపెద్ద శాసనసభా స్థానం కావడం విశేషం.
రెండున్నర లక్షల మందిపైగా ఓటర్లున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో రెండు వేల 7 వందలకుపైగా ఉన్న కొత్త ఓటర్లు కూడా నియోజక వర్గంలో అభ్యర్ధుల గెలుపోటములను నిర్ధారించే అవకాశాలున్నాయి.సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం 40 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం లో వ్యాపించి ఉండి దేశంలోనే రెండో అతిపెద్ద శాసనసభ నియోజక వర్గంగా ప్రాధన్యత సంతరిచుకుంది.

ఇక్కడ TDP నుంచి గెలిచి TRS లో చేరిన సాయన్న అకాల మరణం తర్వాత జరుగుతున్న ఎన్నికలవటంతో బీఆర్ఎస్ పార్టీ ఆయన కుమార్తె లాస్య నందిత ను పోటీకి దింపింది. తండ్రి విషయంలో సానుభూతి తో పాటూ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలనూ, స్థానిక సమస్యల పట్ల తన కార్యాచరణ ప్రణాళికలనూ విస్తృతంగా ప్రచారం చేస్తూ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు లాస్య నందిత.
సానుభూతి ఓటును అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఈ సారి స్వర్గీయ ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల ను బరిలోకి దించింది. కంటోన్మెంట్‌లోనే పుట్టి పెరిగిన తనకు స్థానిక సమస్యల పట్ల అవగాహన ఉందనీ, గద్దర్ కు ఉన్న ప్రజా మద్దతును ఓటు బ్యాంకుగా మలచుకునే పనిలో ఉంది ఆయన కుమార్తె వెన్నెల. తనను ఆదరించాలని కోరుతూ ఆమె కంటోన్మెంట్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఇక BJP అభ్యర్ధి శ్రీ గణేష్ నారాయణన్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లోనూ BJP నుంచి పోటీ చేసి ఓడిపోయిన గణేష్ కాంగ్రెస్లో చేరి, కొంత కాలానికి BRS లోకి వెళ్ళారు. అక్కడ టికెట్టు రాకపోవడంతో, మళ్లీ BJP లో చేరి పోటీలో ఉన్నారు. పార్టీలతో ప్రమేయం లేకుండా ఇక్కడ తాను గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక సమస్యల పరిష్కారం కీలకం అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బరిలో మరో 7 అభ్యర్ధులు కూడా ఉన్నారు. ఏది ఏమైనా గద్దర్ కూతురు వెన్నెలకు, సాయన్న కూతురు లాస్య నందితకు మధ్య హోరాహోరీ వార్ జరుగుతుంది. మరి ఇక్కడ విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి












Click it and Unblock the Notifications