రేవంత్ సర్కార్ పై మాట మార్చిన కడియం శ్రీహరి.. మ్యాటరేంటి?
తెలంగాణా రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక గతంలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నాయకుల వైఖరికి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నాయకుల వైఖరికి మధ్య నక్కకు నాగలోకానికి మధ్య ఉన్న వ్యత్యాసం కనిపిస్తుంది.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఐదేళ్లు అధికారంలో ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దళిత బంధు పథకాన్ని కొనసాగించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. అయితే సరిగ్గా నెల రోజుల క్రితం ఆయన కాంగ్రెస్ పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా ఏడాది వరకు ఓపిక పట్టాలని బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. జనగామ మండలం యశ్వంతపూర్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే . బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు ఉన్నాయని, మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీకి 7సీట్లు ఉన్నాయని, బిజెపికి ఎనిమిది సీట్లు ఉన్నాయని అప్పుడు ఆయన గుర్తు చేశారు.
మొత్తంగా 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మరికొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాదని పేర్కొన్న ఆయన సంవత్సరంలోపు మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఇక ఇప్పుడు యూ టర్న్ తీసుకున్న కడియం శ్రీహరి రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్లు అధికారంలో ఉండాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని వ్యాఖ్యానించిన ఆయన ఇప్పుడు ఐదేళ్లు కొనసాగాలని ఆకాంక్షించడం ఆసక్తిగా మారింది. కడియం శ్రీహరిలో రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల ఇంత సానుకూలత వెనుక కారణం ఏమై ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications