కవిత కొత్త పార్టీ వెనుక ప్రశాంత్ కిశోర్?
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం త్వరలోనే మారబోతోందా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తై, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారా? అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ కొత్త పార్టీ వెనుక దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మేధస్సు ఉండబోతున్నట్లు సమాచారం.
వరుస భేటీలతో మొదలైన చర్చ
గత రెండు నెలలుగా ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ పర్యటనలో ఉన్నప్పుడు కవితతో రెండుసార్లు భేటీ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వీరిద్దరి మధ్య సుమారు ఐదు రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరగడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.తెలంగాణలో ప్రజల సమస్యల చుట్టూ తిరిగే ఓ సరికొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచనను కవిత పంచుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్మాణం, ప్రజల్లోకి ఎలా వెళ్లాలి? ఏయే అంశాలను అజెండాగా తీసుకోవాలి? అనే విషయాలపై పీకే తనదైన శైలిలో సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పట్టణ ప్రాంత యువత, మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా సుదీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

కవిత కొత్త దారి ఎందుకు?
బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం, స్వతంత్ర రాజకీయ అస్తిత్వం కోసం కవిత ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్‌కు అతీతంగా ఓ కొత్త వేదికను ఆమె సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో మారనున్న సమీకరణాలు:
గతంలో నరేంద్ర మోదీ, జగన్మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ వంటి ఉద్ధండుల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు కవితతో జతకడితే అది తెలంగాణలో 'మూడో ప్రత్యామ్నాయం' అవుతుందా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోరు సాగుతుండగా.. పీకే వ్యూహాలతో కవిత కొత్త పార్టీ రేసులోకి వస్తే సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది.
అయితే ఈ వ్యవహారంపై ఇప్పటివరకు అటు కవిత నుంచి కానీ, ఇటు పీకే నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం #KavithaNewParty, #PKinTelangana అనే వార్తలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications