కేసీఆర్, జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, షర్మిల కొత్త డ్రామా:టీటీడీ అధికారులపై జగ్గారెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదంపై తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. జల వివాదం పేరుతో ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోమన్ రెడ్డిపై మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

అందుకే కేసీఆర్, జగన్ విధ్వేషాలు రెచ్చగొడుతున్నారు
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లు కలిసి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోకుండా వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. మంత్రులు కూడా ఇష్టానుసారం మాట్లాడుతూ.. సమస్యను మరింత జఠిలం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రులిద్దరూ జల వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని జగ్గారెడ్డి ఆరోపించారు. ప్రజలు కరోనా కష్టాలు పడుతుంటే దాన్ని పక్కదారి పట్టించేందుకే జల వివాదాన్ని వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కార్మికులు రోడ్లపైకి వచ్చినా జగన్ నోరు మెదపడం లేదని అన్నారు.

షర్మిల కొత్త డ్రామాకు తెరలేపారంటూ జగ్గారెడ్డి
తెలంగాణలో కొత్తగా పార్టీ ప్రారంభించిన వైఎస్ షర్మిలపైనా జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల.. తెలంగాణలో పార్టీ అంటూ కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. తెలంగాణ కోడలే అయినా ఆమెది రాయలసీమ రక్తమే కాదా? అని ప్రశ్నించారు. అక్కడ అన్న.. ఇక్కడ చెల్లెలు ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. షర్మిల పార్టీ పెట్టడం వెనుక బీజేపీ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఇప్పటి వరకు జగన్ ఏ విషయంలోనూ బీజేపీపై విమర్శలు చేయలేదన్నారు.

తిరుమలలో రాజకీయాలొద్దంటూ జగ్గారెడ్డి హెచ్చరిక
తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి వద్ద కూడా రాజకీయాలు చేయడం సరికాదని జగ్గారెడ్డి అన్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామి అందరివాడని, తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలకు అనుమతి లేదని టీటీడీ అధికారులు చెప్పడం సరికాదన్నారు. ఇలాంటి వివాదాలు పెరిగితే రాబోయే రోజుల్లో పెద్ద తుఫానుగా మారుతాయని హెచ్చరించారు. దేవుడి వద్ద రాజకీయాలు సరికాదన్నారు. తెలంగాణ భక్తులు తిరుమలకు రావొద్దా? ఇది దుర్మార్గం, ఇలాంటి ఇష్యూలు పెంచడం ఇద్దరు సీఎంలకు మంచిది కాదు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల సీఎంలపై ఉందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications