తీన్మార్ మల్లన్న ఆఫీసుపై జాగృతి నేతల దాడి.. గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు
హైదరాబాద్‌లోని మేడిపల్లిలో ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి జరిగింది. జాగృతి కార్యకర్తలు, ఎమ్మెల్సీ కవిత అనుచరులు దాడి చేసినట్టు చెబుతున్నారు. ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నంలో మల్లన్న గన్‌మెన్ గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
జాగృతి కార్యకర్తలు మల్లన్న కార్యాలయంలోకి చొరబడి భారీ విధ్వంసం సృష్టించారు. ఆఫీస్‌లోని ఫర్నీచర్, టేబుళ్లు, కుర్చీలను సైతం ధ్వంసం చేసినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా ఆఫీస్ గదుల్లో నేలపై రక్తపు మరకలు కూడా కనిపించాయి. అయితే ఘటన జరిగిన సమయంలో ఆఫీస్‌లో మల్లన్నతో పాటు ఆయన అనుచరులు కూడా ఉన్నట్లు సమాచారం. దాడి ఉదృతంగా మారడాన్ని గమనించిన మల్లన్నకు రక్షణగా ఉన్న గన్‌మెన్, పరిస్థితిని అదుపు చేయడానికి గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.

కాగా ఈ దాడికి కారణం శనివారం ( జూలై 12, 2025 ) మెదక్ జిల్లా పరిధిలో జరిగిన ఒక సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలేనని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను విమర్శిస్తూ, అందుకు సంబరాలు చేసుకునే హక్కు కవితకు ఎవరు ఇచ్చారు అంటూ మల్లన్న ప్రశ్నించారు. అలానే ఆమె తీరు దున్నపోతు ఈనితే దుడ్డెను కట్టేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కవిత తీరు చూసిన వాళ్లంతా నవ్వుకుంటున్నారన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కారణంగానే జాగృతి కార్యకర్తలు దాడి చేసినట్టు భావిస్తున్నారు.
ఈ కాల్పుల అనంతరం దాడిచేసిన వ్యక్తులు అక్కడి నుండి పారిపోయినట్టు తెలుస్తోంది. ప్రజలు నివాసం ఉంటున్న ప్రాంతంలో కాల్పులు జరగడంతో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటన జరిగిన వెంటనే పెద్ద ఎత్తున పోలీసులు మల్లన్న కార్యాలయం వద్ద మోహరించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లనున్నట్టు సమాచారం. తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలానే మధ్యాహ్నం 3.30 గంటలకు డీజీపీని కూడా కలిసి ఫిర్యాదు చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications