జానా రెచ్చిపోతున్నారు! కొడంగల్‌పై కెసిఆర్‌ను నిలదీస్తా: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు గురువారం మండిపడ్డారు. హామీలు నెరవేర్చడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని జానా, ఉత్తమ్ వ్యాఖ్యానించారు. వరంగల్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా గెలుస్తుందని చెప్పారు. వరంగల్ జిల్లాలో వారు మాట్లాడారు. ఇక నుంచి అన్ని ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.
జానా టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల మెతక వైఖరితో ఉన్నాడనే విమర్శలు ఉన్నాయి. కానీ నిన్న, ఈ రోజు ఆయన కెసిఆర్ పైన మండిపడ్డారు. మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ... సోనియా గాంధీ ఆదేశిస్తే తాను వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు.

ప్రభుత్వాన్ని నిలదీస్తా: రేవంత్ రెడ్డి
తన నియోజకవర్గమైన కొడంగల్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే తాను ప్రభుత్వాన్ని నిలదీస్తానని తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురువారం అన్నారు. తన పైన కక్షతో కొడంగల్ అభివృద్ధిని అడ్డుకుంటే సరికాదన్నారు. జయశంకర్ స్మార కేంద్రం ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. హైకోర్టు విభజన అంశం ప్రధాన న్యాయమూర్తి చేతిలో ఉందని చెప్పారు.
ముఖ్యమంత్రి పదవి కోసమే పాలన అన్నట్లుగా కెసిఆర్ తీరు ఉందని తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ గురువారం మండిపడ్డారు. గ్రామస్థాయి నుంచి సమస్యల పైన నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు.
ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ పైన 20కి వాయిదా
ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ పైన విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా పడింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన కోర్టు నోటీసులను శాసన సభాపతి తిరస్కరించారు. ఇదే విషయాన్ని న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. స్పీకర్ నోటీసులు తిరస్కరించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications