ఇండ్లు, బంగారం.. హైదరాబాద్, వరంగల్లో రూ.2కోట్ల ఆస్తులు: డిఎస్పీ అరెస్టు
జనగామ: అవినీతి నిరోధక శాఖ బుధవారం నాడు జనగామ డిఎస్పీ సురేందర్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. అక్రమాస్తులు ఉన్నాయని సమాచారం కావడంతో ఉదయం నుంచే ఎసిబి సోదాలు నిర్వహించింది. అతనిని ఎసిబి అదుపులోకి తీసుకుంది.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారనే సమాచారం మేరకు ఎసిబి అధికారులు బుధవారం జనగామ డిఎస్పీ సురేందర్ ఇంటిపై మెరుపుదాడి చేసి, తనిఖీలు నిర్వహించారు. ఉదయం ఐదు గంటలకు డిఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఎసిబి డిఎస్పీ నివాసంలోకి వెళ్లి దాడులు ప్రారంభించారు.
ఉదయం ఐదు గంటలకు ప్రారంభించిన దాడులు మధ్యాహ్నం ఒకటి గంటల వరకు నిర్వహించారు. మధ్యాహ్నం ఎసిబి అధికారులు తాము చేసిన తనిఖీల్లో లభించిన నగదును, మద్యం బాటిళ్లను మీడియాకు చూపించారు. డిఎస్పీ కూర సురేందర్‌ను మీడియాకు కనిపించకుండా వాహనంలోకి ఎక్కించారు.
ఈ సందర్భంగా ఎసిబి వరంగల్ రేంజ్ డిఎస్పీ సాయిబాబా మాట్లాడారు. స్థానిక డిఎస్పీ కూర సురేందర్ పైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తాము తనిఖీలు నిర్వహించామన్నరాు. ఏకకాలంలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి ఆయన ఆస్తులకు సంబంధించిన ఆధారాలు సేకరించామన్నారు.

వరంగల్, హన్మకొండలో అపార్ట్‌మెంట్స్, హైద్రాబాద్‌లో పలు చోట్ల ఉన్న నాలుగు గృహాలకు సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు వివిధ ప్రాంతాల్లో 5 ఇంటి స్థలాలకు చెందిన రిజిస్ట్రేషన్ పత్రాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. 14విలువైన విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇప్పటి వరకు తాము చేసిన తనిఖీల్లో సుమారు రూ.కోటికి పైగా సంబంధించిన ఆస్తులు ఉన్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. డిఎస్పీ కూర సురేందర్‌ను అదుపులోకి తీసుకొని జిల్లా కేంద్రానికి తరలించినట్లు చెప్పారు. ఉన్నతాధికారులకు నివేదిక అందచేసిన అనంతరం చట్టరీత్యా ఆయనపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
జనగామ, హైదరాబాద్, నర్సంపేట, హన్మకొండలలో ఏపీబీ సోదాలు చేసింది. తిలక్ నగర్, బాలసముద్రంలలో ఇండిపెండెంట్ ఇళ్లు, ఉప్పల్లోని వెంకటేశ్వర అపార్టుమెంట్సులో ఓ ప్లాట్, జనచైతన్య అపార్టుమెంటులో రెండు ప్లాట్లు, హన్మకొండలోని నక్షత్ర అపార్టుమెంటులో ఓ ప్లాటు, ఐదు ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లుగా గుర్తించారని తెలుస్తోంది. అందులో రెండు వరంగల్లో, మూడు హైదరాబాదులో ఉన్నాయి.
ఎసిబి రూ.8 లక్షలకు పైగా క్యాష్, 78 తులాల బంగారం, రెండు కిలోలకు పైగా వెండి, 14 బాటిళ్ల విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.2 కోట్ల ఆస్తులు గుర్తించారని తెలుస్తోంది. సురేందర్‌ను ఎసిబి అధికారులు విచారిస్తున్నారు. ఈ తనిఖీల్లో హైద్రాబాద్ రేంజ్ డిఎస్పీ ప్రభాకర్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications