అద్భుతమైన జలపాతం.. హైదరాబాద్ కు 60 కి. మీ. దూరంలోనే..
తెలంగాణలో అనేక జలపాతాలు ఉన్నాయి. ప్రకృతి ప్రేమికుల్ని , పర్యటకుల్ని అలరిస్తున్నాయి. తెలంగాణలోని జలపాతాలు ఎక్కువగా ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్ అడవుల్లోనే ఉన్నాయి. అయితే హైదరాబాద్ కు దగ్గరలోనే కేవలం 60 కి. మీ. దూరంలోనే అద్దిరిపోయే జలపాతం ఉందని మీకు తెలుసా..? ప్రస్తుతం ఈ వాటర్ ఫాల్ పర్యటకుల్ని అమితంగా ఆకర్షిస్తోంది. వీకెండ్ లో ఇలా వెళ్లి అలా సాయంత్రానికి ఇంటికి చేరుకునే విధంగా ఉండటంతో వారాంతాల్లో ఈ జలపాతం అందాలను చూసేందుకు పర్యటకులు ఆసక్తిని చూపిస్తున్నారు.
హైదరాబాద్ నగర వాసులు ఈ జలపాతం అందాలను చూసేందుకు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటివరకూ మనకు జలపాతాలు అంటే కుంటాల, బోగత మాత్రమే గుర్తుండేవి. అవి ఆదిలాబాద్ జిల్లాలో ఉండటం కారణంగా సమయం లేక చాలా తక్కువమంది మాత్రమే వెళ్లేవారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ కు కేవలం 60 కి. మీ. దూరంలోనే ఉన్న ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యటకులు క్యూ కడుతున్నారు. ఈ వాటర్ ఫాల్స్ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండ గ్రామానికి సమీపంలో ఉంది. అక్కడే ఉన్న గుట్టలపైనుంచి నీరు కిందకు దుంకుతూ జలపాతాన్ని తలపిస్తోంది.
ఈ బోడకొండ జలపాతం అందాలను చూసేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా ప్రకృతి ప్రేమికులు పోటెత్తుతున్నారు. మరోవైపు బోడ కొండ వాటర్ ఫాల్స్ ను పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో మున్ముందు రోజుల్లో పర్యటకుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఇక వర్షాకాలంలో అయితే కొండలతో ఉన్న ఈ ప్రదేశం ఊటీని తలపిస్తోందని పర్యాటకులు చెబుతున్నారు.

ఇక ఈ బోడకొండ జలపాతానికి చేరుకోవాలంటే.. హైదరాబాద్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉందీ ప్రాంతం. ఈ వాటర్‌ఫాల్స్ ను చేరుకోవాలంటే సాగర్ హైవే మీదుగా ప్రయాణం చేస్తుంటే హైవే నుంచి మధ్యలో లోయపల్లి రోడ్డు అని కనిపిస్తుంది. అక్కడి నుంచి ఎడమ వైపునకు వెళ్లాల్సి ఉంటుంది. మంచాల మండలం నుండి 12.4 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే బోడకొండ జలపాతాన్ని చేరుకోవచ్చు.












Click it and Unblock the Notifications