ఎస్సీలు, ఎస్టీల కోసం బీజేపీ చేసిందేంటి? బండి సంజయ్ కు కడియం శ్రీహరి సవాల్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19 ఎస్సి, 12 ఎస్టీ నియోజకవర్గాలపై ఫోకస్ చేయాలని, టిఆర్ఎస్ పార్టీకి ఉన్న వ్యతిరేకతను రానున్న ఎన్నికలలో ఓటు బ్యాంకుగా మలుచుకునే ప్రయత్నం చేయాలని, ఈ నియోజకవర్గాలను బీజేపీ కైవసం చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పిన బిజెపి నేతలపై టిఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హన్మకొండలోని హరిత హోటల్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎంపీ దయాకర్ లు బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని మండిపడ్డారు.

ఎస్సీ, ఎస్టీల కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పాలి: కడియం శ్రీహరి
దేశంలో, రాష్ట్రంలో దళితుల సంక్షేమం కోసం బీజేపీ ఏమి చేసిందో చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అన్ని వర్గాలకు అన్యాయం చేస్తూ, అణగదొక్కే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్నారని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాల రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి ఎస్సి, ఎస్టీ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన నియోజకవర్గాలను ఎత్తి వేసేందుకు ప్లాన్ చేస్తుందని ఆరోపించారు.

రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం
ఇప్పటికే అనేక రాష్ట్రాలలో బీజేపీని ఓడిస్తున్నారని, ప్రస్తుతం దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలలోనూ బిజెపికి ఓటమి తధ్యమని కడియం శ్రీహరి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ 2023,2024 సంవత్సరంలో జరుగనున్న ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలు అవుతుందని కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలలో టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎస్సీ ల కోసం టిఆర్ఎస్ పార్టీ దళిత బందు పథకాన్ని తీసుకు వచ్చిందని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

ఎస్టీలకు బీజేపీ చేసిందేమీ లేదు
ఇక ఎస్టీల విషయంలోనూ బీజేపీ ఏమీ చేయలేదని మండిపడిన కడియం శ్రీహరి టూరిజం శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను గిరిజనుల పై అభిమానం ఉంటే జాతీయ పండుగగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత వరంగల్ లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని కేంద్ర హామీ ఇచ్చిన ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరలేదని మండిపడ్డారు. తెలంగాణలో తప్ప ఇతర రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయాలని బండి సంజయ్ కు సవాల్
పోడు భూముల విషయంలో బండి సంజయ్ మాట్లాడుతూ పోడు రైతులకు అండగా ఉంటామని చెబుతున్నారని మండిపడ్డారు. అసలు పోడు భూముల వ్యవహారంలో నీకు అవగాహన ఉందా అంటూ బండి సంజయ్ ను ప్రశ్నించారు. అటవీశాఖ భూములు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని పేర్కొన్నారు. బండి సంజయ్ కు దమ్ముంటే కేంద్రప్రభుత్వం పై ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయాలని సవాల్ విసిరారు.

కులమతాలను రెచ్చగొట్టాలని మాట్లాడుతున్నావ్ బండి సంజయ్ పై కడియం ఫైర్
షెడ్యూల్డు తెగల వారి కోసం బిజెపి సర్కారు ఏం చేసిందో చెప్పాలని కడియం శ్రీహరి ప్రశ్నించారు. బండి సంజయ్ కు అవగాహన ఉంటేనే మాట్లాడాలని హితవు పలికారు. కులమతాలను రెచ్చగొట్టాలని మాట్లాడుతున్నావ్ అంటూ మండిపడ్డారు. బిజెపికి తెలంగాణ ప్రజల మీద నిజంగా ప్రేమ ఉంటే విభజన హామీలను అమలు చేయాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications