కావ్య మారన్-అనిరుధ్ పెళ్లి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం!
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్యమారన్ వివాహానికి సంబంధించిన వార్తలు మరోసారి సోషల్ మీడియాలో, మీడియా వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, ఆయన భార్య శుక్రవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సతీమణిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కూతురు కావ్యమారన్ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి దంపతులను సాదరంగా ఆహ్వానించారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్యమారన్ , సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహం గ్రీస్‌లో నవంబర్ 11న అట్టహాసంగా జరగనున్నట్లు తెలుస్తోంది. అనంతరం నవంబర్ 14న చెన్నైలో ప్రధాన వివాహ కార్యక్రమాలు ఉంటాయి. అయితే వారి వివాహ రిసెప్షన్ నవంబర్ 21న చెన్నైలో వైభవంగా జరగనున్నట్లు సమాచారం. ఈ రిసెప్షన్‌కు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులను కళానిధి మారన్ దంపతులు ఆహ్వానించారు. ఇదిలా ఉండగా.. ఈ పెళ్లి ముహూర్తాలు, వేదికలకు సంబంధించి ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.

సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురు అయి కావ్యమారన్.. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ బాధ్యతలను చూసుకుంటూ క్రీడా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు అనిరుధ్ రవిచందర్ తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో అగ్ర శ్రేణి సంగీత దర్శకుడిగా రాణిస్తున్నారు. తాజాగా రజనీకాంత్ నటించిన 'జైలర్-2' సినిమాకు కూడా ఆయనే సంగీతం అందించారు. వీరిద్దరి పెళ్లిపై గడిచిన కొన్ని నెలలుగా నెట్టింట కథనాలు వస్తుండగా.. అనిరుధ్ బంధువు, సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ గతంలో చేసిన కామెంట్స్ ఈ ప్రచారానికి మరింత బలాన్నిచ్చాయి.
ప్రస్తుతం కళానిధి మారన్ దంపతులు ఈ వివాహ వేడుకకు దేశంలోని వివిధ రంగాల ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానం అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వివాహానికి తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సహా పలువురు సినీ, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు హాజరుకానున్నారని సమాచారం.














Click it and Unblock the Notifications
