ఆ బస్ ఛార్జీలను తగ్గించిన టీజీఎస్ఆర్టీసీ
TGSRTC: పవిత్ర కార్తీక మాసం ఆరంభమైన నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రఖ్యాత శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జాము నుంచే పలు ఆలయాల్లో భక్తులు బారులు తీరి నిల్చున్నారు. భక్తి ప్రపత్తులతో దీపాలను వెలిగించి పూజలు చేస్తోన్నారు.
ఏకాదశి, సోమ, శనివారాల్లో ఉపవాసాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తోంది. తెల్లవారు జామున, సాయంత్ర వేళల్లో ఆలయాల్లో దీపాలను వెలిగిస్తుంటారు భక్తులు. తులసికి ప్రత్యేక పూజలు చేస్తారు. గోవులను పూజిస్తారు. ఈ మాసంలో పరమశివుడికి ఆవు పాలతో అభిషేకించి, జాజిపూలతో పూజించితే శివస్థానాన్ని పొందుతారని ప్రశస్తి.

పవిత్ర కార్తీక మాసంలో నదుల్లో పుణ్యస్నానాలను ఆచరించడం, దైవదర్శనం చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం. రోజుకొకటి చొప్పున కార్తీక పురాణంలో ఉండే 30 అధ్యాయాలను పారాయణం చేయడం శుభప్రదంగా భావిస్తారు. శైవక్షేత్రాల్లో కార్తీక పురాణాన్ని పారాయణం చేస్తారు.
కార్తీక మాసాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు రాష్ట్రంలోని ప్రఖ్యాత శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడిపించనున్నారు. ఏపీలో ఉన్న శ్రీశైలం సహా వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట వంటి ఆలయాలకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులను అందుబాటులోకి తీసుకుని రానున్నారు.
దీనిపై టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ సమీక్ష నిర్వహించారు. కార్తీక మాసం, శబరిమల ఆపరేషన్స్ సంస్థకు ఎంతో కీలకమైనవని, భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఆది, సోమవారాల్లో శైవక్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఈ నెల 15వ తేదీన కార్తీక పౌర్ణమి నేపథ్యంలో తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామని సజ్జనార్ తెలిపారు. అలాగే-ఏపీలోని పంచారామాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వివరించారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చని చెప్పారు.
అద్దె ప్రాతిపదికన నడిపించే ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించినట్లు సజ్జనర్ తెలిపారు. పల్లె వెలుగు కిలోమీటర్‌కు రూ.11, ఎక్స్ ప్రెస్ రూ.7, డీలక్స్ రూ.8, సూపర్ లగ్జరీ రూ.6, రాజధాని రూ.7 మేర తగ్గించినట్లు పేర్కొన్నారు. శబరిమల, శుభముహుర్తాలకు అద్దెకు ఆర్టీసీ బస్సులను బుకింగ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications