కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి కాసాని జ్ఞానేశ్వర్: ముహూర్తం ఖరారు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ (kasani gnaneshwar) అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం రోజున బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో కాసాని గులాబీ కండువా కప్పుకోనున్నారు.
శుక్రవారం ఉదయం 11.30 గంటలకు గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి ఫార్మ్ హౌ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నాకగ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. భద్రతా పరమైన కారణాల దృష్ట్యా పరిమిత సంఖ్యలో తన అనుచర నాయకులతో కలిసి గులాబీ తీర్థం పుచ్చుకొనున్నారు.

రెండు రోజుల క్రితం తెలంగాణ తెలుగుదేశం పార్టీకి, అధ్యక్ష పదవికి కాసాని రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించినందు వల్లే రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
తన రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించినట్లు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాసాని సుముఖంగా ఉండగా.. టీడీపీ అగ్ర నాయకత్వం మాత్రం అందుకు అంగీకరించకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి రాజీనామా చేశారు కాసాని.
ముందు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించి.. అభ్యర్థుల జాబితా కూడా సిద్ధం చేసిన తర్వాత.. ఎన్నికల్లో పోటీ చేయకూడదని అధిష్టానం నిర్ణయించడం కాసానికి తీవ్ర నిరాశకు గురిచేసింది. మరోవైపు, తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా అగ్ర నాయకత్వం నిర్ణయంపై అసంతృప్తి గుర్రుగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు పార్టీలో ఉండి ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలని అధిష్టానానికి చెప్పినా.. వినకపోవడంతో కాసాని చివరకు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నుంచి ఆహ్వానాలు అందగా.. కాసాని మాత్రం బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications