కౌశిక్ రెడ్డికి కేసుల గండం -క్లియర్ కాని ఎమ్మెల్సీ నియామకం : వాట్ నెక్స్ట్.!!
హుజూరాబాద్ యువ నేత కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ గా అధికారికంగా నియామకం ఎప్పుడు. ఈ నెల 1వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, గవర్నర్ నుంచి అధికారికంగా నియామక నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీని పైన పార్టీలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ లో ఉప ఎన్నిక వేళ..కేసీఆర్ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగుల్లో భాగంగా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. అయితే, దీనికి సంబంధించి అసలు ఫైల్ రాజ్ భవన్ కు వెళ్లలేదని విశ్వసనీయ సమాచారం.

కేసులు పెండింగ్ కారణమా..
దీనికి పలు కారణాలు బయటకు వస్తున్నాయి. కౌశిక్ రెడ్డికి సంబంధించి పెండింగ్ లో ఉన్న కేసులే ఈ ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. వీటిని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తరువాత..క్లియరెన్స్ కోసం గవర్నర్ వద్దకు ఫైల్ వెళ్తుందని అధికార టీఆర్ఎస్ నేతల సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్‌రెడ్డిపై ఇల్లంతకుంట, సుబేదారి పోలీస్‌స్టేషన్లలో కేసులు పెట్టారు. ఆ తర్వాత కూడా వీణవంక, హుజూరాబాద్ టౌన్, కరీంనగర్, జమ్మికుంట, సిరిసిల్ల తదితర పోలీస్‌స్టేషన్ల పరిధిలో వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

రాజేందర్ ను దెబ్బ కొట్టేందుకు..
వాహనం పార్కింగ్ విషయంలో తమ బంధువుపై కౌశిక్‌రెడ్డి దాడి చేశారని 2019 ఫిబ్రవరిలో సినీనటులు జీవిత, రాజశేఖర్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కూడా. హుజూరాబాద్‌లో రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కౌశిక్‌రెడ్డిని హడావుడిగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ తీర్మానించారు. సాహిత్యం, సైన్స్, కళలు, సహకార ఉద్యమం, సామాజిక సేవ తదితర రంగాల్లో అనుభవమున్న వారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అధికారం రాష్ట్ర మంత్రిమండలికి ఉంటుంది. రాజేందర్ ను దెబ్బ తీసేందుకు కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించారు.

క్రీడా -సేవా రంగంలో ఉన్నారంటూ..
దేశవాళీ క్రికెట్‌లో రాణించిన కౌశిక్‌రెడ్డి.. తన తల్లి పేరిట కరీంనగర్ జిల్లాలో పుష్పమాల దేవి మెమోరియల్ ట్రస్టు పెట్టి 2009 నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మేరకు క్రీడా, సేవా రంగాల్లో చేసిన కృషి మేరకు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తున్నట్టు కేబినెట్ తీర్మానంలో పేర్కొంది. అయితే కౌశిక్‌రెడ్డికి పదవి ఇవ్వడంపై హుజూరాబాద్ టీఆర్‌ఎస్ శ్రేణులతోపాటు రాష్ట్ర నాయకుల్లోనూ అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమైనట్టు తెలిసింది. ఇదే సమయంలో కౌశిక్‌రెడ్డిపై నమోదైన కేసుల విషయంగా సీఎంకు ఫిర్యాదులు అందాయని, దానితో నివేదిక కోరారని సమాచారం.

న్యాయ పరమైన చిక్కులు రాకుండా..
ఇదే సమయంలో కొందరు టీఆర్ఎస్ నేతలు మహారాష్ట్రంలోని పరిణామాలను గుర్తు చేస్తున్నారు. మహారాష్ట్రలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను నామినేట్ చేయడంపై దాఖలైన పిటిషన్ హైకోర్టులో నెలల తరబడి నలుగుతోంది. మన రాష్ట్రంలోనూ గవర్నర్ కోటాలో గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్‌లను నామినేట్ చేయడంపై ధన్‌గోపాల్‌రావు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి విషయంగా ఆచితూచి అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.

కాంగ్రెస్ నేతల పరువు నష్టం కేసు...
కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌కు లంచం ఇచ్చారని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై మాణిక్యం ఠాగూర్ పరువు నష్టం దావా వేశారు. దీంతో..మొత్తంగా కేసులేమిటి, వాటి వెనుక ఉన్న కారణాలేమిటన్న దానిపై అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ నివేదికను పూర్తిగా పరిశీలించాకే.. కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications