సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తుంది?: కోర్టులో కవిత పిటిషన్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తనను సీబీఐ అదుపులోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ కల్వకుంట్ల కవిత రౌస్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సీబీఐ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జైల్లో ఉన్న తనను ఎలా అరెస్ట్ చేసిందంటూ పేర్కొన్నారు. ఈ మేరకు కవిత తరపున న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన కోర్టును కోరారు. అయితే, గురువారం (ఏప్రిల్ 11) రంజాన్ కావడంతో డ్యూటీ జడ్జి మనోజ్ కుమార్ ఉన్నారు.

కవిత తరఫున రాణా, మోహిత్ రావులు వాదనలు వినిపించారు. అయితే ఈ కేసు గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని జడ్జి మనోజ్ కుమార్ తెలిపారు. తన ముందు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన విచారణ జరగలేదని తెలిపారు. కాబట్టి ఇందులో తాను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం పది గంటలకు రెగ్యులర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు.
కాగా, కవితను మార్చి నెల 15న ఈడీ హైదరాబాద్‌లోని ఆమె నివాసం నుంచి అరెస్ట్ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఆమెను ఈడీ పది రోజుల పాటు విచారించింది. ఆ తర్వాత ఆమె తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇలాంటి సమయంలో సీబీఐ ఆమెను తమ కస్టడీలోకి తీసుకుంది.












Click it and Unblock the Notifications