ఆ నినాదంతో బలంగా.. ట్రంప్ బాటలో కవిత!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను అనుసరిస్తున్నారు. అన్ని విషయాల్లో కాదు కేవలం ఒక్క విషయంలోనే ఆమె ట్రంప్ ను అనుసరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలతో అర్ధం అవుతుంది. తనపై నమోదైన ఢిల్లీ లిక్కర్ కేసు వీగిపోవడంతో వేంకటేశ్వరస్వామికి మొక్కు చెల్లించుకునేందుకు ఆమె కుటుంబసభ్యులతో, జాగృతి నాయకులతో కలిసి తిరుమల వెళ్ళిన కవిత అక్కడ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
డోనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదం, కవిత తెలంగాణా ఫస్ట్ నినాదం
రాబోయే రెండు నెలల్లో 'తెలంగాణ ఫస్ట్' అనే నినాదంతో నూతన పార్టీని స్థాపించనున్నట్లు కవిత ప్రకటించారు. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తే కవిత ఇప్పుడు తెలంగాణా ఫస్ట్ అన్న నినాదంతో పొలిటికల్ పార్టీ పెట్టాలని భావిస్తున్నారు. తిరుమల స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆమె విమర్శించారు.

తెలంగాణాకే మొదటి ప్రాధాన్యత అని బలమైన సంకేతం
ప్రతిపక్షాలు, బీఆర్ఎస్ సైతం తమ పాత్రను సరిగా పోషించలేదన్నారు కవిత. ఈ లోపంతోనే కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందిందని అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రజలు బలమైన ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని కవిత తెలిపారు. తమ పార్టీ అన్ని వర్గాలకు సేవలందిస్తుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణాకే మొదటి ప్రాధాన్యత అని చెప్పి బలమైన సంకేతాన్ని ఇచ్చారు.
రాజకీయంగా కవిత నినాదంపై చర్చ
ప్రపంచ రాజకీయాల్లో దేశ ప్రయోజనాలు ముందు అనే భావనతో డోనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష పదవీకాలంలో "America First" అనే నినాదాన్ని బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో రాష్ట్ర ప్రయోజనాలను ముందుకు తెచ్చేలా "తెలంగాణ ఫస్ట్" అనే ఆలోచనను కవిత ప్రస్తావించడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.
కవిత నినాదం కొత్త రాజకీయ సందేశంగా మారే ఛాన్స్
తెలంగాణ అభివృద్ధి, స్థానిక హక్కులు, రాష్ట్ర వనరుల పరిరక్షణ వంటి అంశాల్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నినాదం కవిత తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత తీసుకున్న "తెలంగాణ ఫస్ట్" నినాదం కొత్త రాజకీయ సందేశంగా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications