పెట్టుబడుల వేట: వాండా కేంద్ర కార్యాలయంలో కెసిఆర్
హైదరాబాద్: చైనాలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారంనాడు చైనా రాజధాని బీజింగ్‌లో వాండా కంపెనీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. సీఎంతోపాటు రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతినిధి బృందం కూడా ఉంది.
ఈ సందర్బంగా కెసిఆర్ వాండా కంపెనీ సీనియర్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు వాండా గ్రూప్ ఆఫ్ కంపెనీ అంగీకరించింది. దేశంలోనే అత్యంత అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్న హైదరాబాద్ నగరం విశ్వనగరంగా రూపొందుతోందని ముఖ్యమంత్రి వాండా కంపెనీ ప్రతినిధులకు వివరించారు.

హైదరాబాద్‌ను స్లమ్‌ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడానికి సుమారు రెండు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ వాండా ప్రతినిధులకు వివరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. త్వరలో హైదరాబాద్‌లో తమ ప్రతినిధుల బృందం సందర్శించి భాగస్వామ్య మయ్యే అంశాలను పరిశీలిస్తుందని వాండా ప్రతినిధులు తెలిపారు.

కెసిఆర్‌తో పాటు చైనా పర్యటనకు వెళ్లిన బృందం ఇవాళ షాంఘై మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించింది. రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలినీ మిశ్రా, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఈ బృందంలో ఉన్నారు.

షాంఘై నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, పార్కులు, ప్లే గ్రౌండ్ల నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ఆధునిక యంత్రాల వినియోగం తదితర అంశాలను బృందం పరిశీలించింది. ప్రజలకందించే పౌర సదుపాయాలు, ప్రజల భాగస్వామ్యం, ఆదాయ, వ్యయాలు తదితర అంశాలను పరిశీలించింది.












Click it and Unblock the Notifications