ట్యాంక్‌బండ్‌పై ఎవరెవరి విగ్రహాలో: కెసిఆర్, వరంగల్‌ను 'స్మార్ట్' చేస్తాం: వెంకయ్య
హైదరాబాద్/వరంగల్: ట్యాంక్ బండ్ పైన ఎవరెవరి విగ్రహాలు పెట్టాలో త్వరలో నిర్ణయిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం నాడు అన్నారు. అలియాబాదులో రెడ్డి జనసంఘం వజ్రోత్సవాలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో కెసిఆర్‌తో పాటు హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, జస్టిస్ సుభాషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో అన్నింటా అన్యాయం జరిగిందని చెప్పారు. ట్యాంక్ బండ్ పైన రావ్ బహదూర్, సురవం ప్రతాప్ రెడ్డి విగ్రహాలు లేకపోవడం బాధాకరమన్నారు.
ఎవరెవరి విగ్రహాలు పెట్టాలో త్వరలో నిర్ణయిస్తామన్నారు. కనీసం ట్యాంక్ బండ్ పైన ఉన్న విగ్రహాలకు గౌరవం కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి హాస్టల్‌కు స్థలం ఇస్తామని, రూ.10 కోట్లు మంజూరు చేస్తామన్నారు.

హృదయ్ పథకం మొదట వరంగల్లోనే: వెంకయ్య
హృదయ్ పథకం మొట్టమొదట వరంగల్ నగరంలోనే ప్రారంభమైందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం చెప్పారు. ఆయన వరంగల్లో బిజెపి నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం హృదయ్ పథకంలో భాగంగా రూ.3 కోట్లతో భద్రకాళి బండ్ పనులను వెంకయ్య నాయుడు ప్రారంభించారు.
వేయి స్తంభాల గుడిలో పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తామన్నారు. పత్తికొనుగోలు పైన రేపు సిసిఐ అధికారులతో మాట్లాడుతానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ మార్పులకు ప్రయత్నాలు చేస్తుంటే ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు.

వరంగల్ జిల్లా అబివృద్ధిపై దృష్టి సారించామన్నారు. స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వరంగల్ ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దితే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్నారు. తమ సొంతూరు నెల్లూరు కూడా స్మార్ట్ సిటీలో లేదన్నారు. హృదయ్ పథకం దేశానికి హృదయం లాంటిదన్నారు.
కేంద్రం, రాష్ట్రం కలిసి పని చేస్తే అభివృద్ధి సాధ్యమన్నారు. పార్టీలు, జెండాలు వేరైనా అభివృద్ధి కోసం కలిసి పని చేయాలన్నారు. స్మార్ట్ సిటీల ఎంపికలో పారదర్శకత పాటించాలన్నారు. ముద్రా బ్యాంకు ద్వారా పేదవారికి రుణాలు అందిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications