గిరి గీసి బరిలోకి.. కేసీఆర్ తనయ కవిత: టార్గెట్ ఫిక్స్!!
నిజామాబాద్ ఎమ్మెల్సీ, కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? వచ్చే ఎన్నికలకు కవిత సిద్ధమవుతున్నారా? ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నారా? తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కవిత ఆ దిశగా పావులు కదుపుతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.
నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత వచ్చే ఎన్నికలలో అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్నట్టు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కవిత పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా, ఎమ్మెల్సీ కవిత అడుగులు మాత్రం నిజామాబాద్ లో బలంగా పడుతున్నాయి. నిజామాబాద్ అర్బన్ స్థానం నుండి ఎమ్మెల్సీ కవిత ఎన్నికల బరిలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

స్థానికంగా రాజకీయాలపై ఫోకస్ చేస్తున్న కవిత పనితీరు కూడా అందుకు ఊతం ఇస్తుంది. ఇటీవల నిజామాబాద్ లో కవిత ఎనిమిది రోజుల పాటు మకాం వేసి మరీ అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తాని పక్కన పెట్టి మరీ కవిత పర్యటనలు సాగుతున్నాయి. ఇటీవల జరిగిన రెడ్డి సంఘం సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఆ సమావేశానికి ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు ఆహ్వానం లేదు.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యే గణేష్ గుప్తాపై స్థానిక ప్రజలలో అసంతృప్తి ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేసినటువంటి సర్వే లో గణేష్ గుప్తాకు టికెట్ ఇస్తే నిజామాబాద్ అర్బన్ స్థానం గల్లంతేనని రిపోర్ట్ వచ్చినట్టుగా సమాచారం. అంతేకాదు స్థానికంగా ఏ పనైనా 30 పర్సెంట్ కమీషన్ లేనిదే గణేష్ గుప్త చేయడంలేదని, ఈ క్రమంలో ఆయనకు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని చర్చ జరుగుతుంది.
ఇదే సమయంలో స్థానిక రాజకీయాలలో దూకుడుగా ముందుకు వెళ్తున్న కవిత తీరు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దిగుతారు అన్న చర్చకు కారణంగా మారింది. గతంలో నిజామాబాదు ఎంపీ గా పనిచేసిన కవిత, పసుపు రైతుల దెబ్బతో ఎంపీగా ఓటమి పాలయ్యారు. ఆపై చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ రాజకీయాలలో యాక్టివ్ గా మారిన కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కవిత వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా బరిలోకి దిగి, ఆపై మంత్రిగా తెలంగాణలో చక్రం తిప్పాలని, కీలకంగా పని చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణలో టార్గెట్ ఫిక్స్ చేసుకున్న కవిత త్వరలో రానున్న ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ లో తరచూ పర్యటిస్తున్నారు. ఎన్నికల వ్యూహాలతో అడుగులు వేస్తున్నారని ఆసక్తికర చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications