కేసీఆర్.. దమ్ముంటే మునుగోడులో పోటీ చెయ్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్!!
నల్గొండ జిల్లా: మునుగోడు ఉపఎన్నిక జరిగిన నెలరోజుల్లోనే తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. కేసీఆర్ కు దమ్ముంటే టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. మునుగోడులో కేసీఆర్ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.

మునుగోడు ఉపఎన్నిక తెలంగాణా రాజకీయాలను మారుస్తుంది
ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో గ్రామగ్రామాన పర్యటిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశంలో మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాలను మారుస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ గెలిచేది లేదని స్పష్టం చేశారు.

తాను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తినయితే ఎమ్మెల్యేగా రాజీనామా ఎందుకు చేస్తా
తాను కాంట్రాక్టులకు, డబ్బులకు అమ్ముడు పోయి బీజేపీలో చేరానని చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. తాను డబ్బులకు అమ్ముడు పోయే వ్యక్తిని అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వాడిని కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ ప్రజలు, కెసిఆర్ కుటుంబానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని పేర్కొన్న ఆయన, మునుగోడు ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువని, ఆకలినైనా తట్టుకుంటారు కానీ ఓట్లు అమ్ముకోరు అని స్పష్టం చేశారు.

మునుగోడు ప్రజల తీర్పు టీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం కానుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మునుగోడులో ప్రజలు ఇచ్చే తీర్పు టిఆర్ఎస్ పార్టీకి చెంప పెట్టు కావాలని పేర్కొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల ఆదరణ తనకు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 21వ తేదీన మునుగోడులో జరిగిన భారీ బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.

ప్రజాక్షేత్రంలో దూకుడుగా ముందుకు వెళ్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు బిజెపి అభ్యర్థిగా ఖరారు కావడంతో, ఆయన దూకుడుగా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. గ్రామగ్రామాన పర్యటిస్తూ తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక పార్టీ శ్రేణులను సైతం ఏకతాటి మీదకు తీసుకువచ్చి మునుగోడులో విజయకేతనం ఎగరవేయడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు.












Click it and Unblock the Notifications