సభకు రండి: కాంగ్రెస్, టీడీపీలకు కేసీఆర్ పిలుపు, ‘70ఏళ్ల తర్వాత బిజెపి’
అసెంబ్లీకి రండి, ప్రభుత్వానికి మంచి సూచనలివ్వండి.. తాము స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.
హైదరాబాద్: అసెంబ్లీకి రండి, ప్రభుత్వానికి మంచి సూచనలివ్వండి.. తాము స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసి సభ నుంచి వెళ్లిపోయిన తర్వాత సీఎం కేసీఆర్ సభలో మాట్లాడారు. ప్రతిపక్షాలు వాకౌట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో అధికారాలు రావడం పోవడం సాధారణ ప్రక్రియ అని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చాక సుమారు 70ఏళ్ల తర్వాత తొలిసారి బిజెపి కేంద్రంలో సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
కాంగ్రెస్, మరో పార్టీ సభకు రాకపోవడం మంచిది కాదన్నారు. ఎన్ని రోజులైనా సభను జరపడానికి , ఏ అంశంపైనైనా చర్చకు సిద్దంగా ఉన్నామని చెప్పాక వివాదం ఎందుకు వస్తుందని ప్రశ్నించారు.
సభకు రండి, ప్రభుత్వానికి మంచి సూచనలిస్తే స్వీకరిస్తుందని తెలిపారు. బుధవారం తన స్పీచ్ విన్నాక మల్లన్నసాగర్ రైతులు తనకు ఫోన్ చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. వారిలో కొందరు తనకు తెలిసిన వారుంటే వారితో తాను మాట్లాడానని వివరించారు.

పార్లమెంటరీ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని అన్నారు. తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామనే ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారని అన్నారు. అసెంబ్లీ ఉద్యోగుల జీతాలు పెంచుతామని అన్నారు. సాధ్యమైనంత త్వరగా ఏరియర్స్ అన్ని చెల్లిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ, మరో పార్టీ సభకు రావాలని వినమ్ర పూర్వకంగా కోరుతున్నానని తెలిపారు. తర్వాత స్పీకర్ మాట్లాడుతూ.. సభకు రానటువంటి కాంగ్రెస్, టీడీపీ సభ్యులు సభకు రావాలని విజ్ఞప్తి చేశారు.
ఆ తర్వాత సభలో ముఖ్యమైన హరితహారంపై చర్చిద్దామని కేసీఆర్ సభ్యులకు తెలిపారు. ప్రధాని మోడీ కూడా పర్యావరణంపై ప్రపంచ వేదికల్లో పాల్గొని సూచనలు చేశారని చెప్పారు. ఆకుపచ్చ తెలంగాణ రాష్ట్ర సాధనకు రాజకీయాలకతీతంగా అన్నివర్గాలు సహకరించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
అడవుల పరిరక్షణను గత ప్రభుత్వాలు విస్మరించాయని, పచ్చదనంలేక ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటోందన్నారు. మనుషులే విచక్షణారహితంగా వనాల విధ్వంసానికి పాల్పడుతున్నారన్నారని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నర్సరీలను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ఈ పథకం చేపట్టిన తర్వాత ప్రజలందరూ అమితోత్సాహంతో అనువైన చోట మొక్కలు నాటారని చెప్పారు. విజయవాడ, బెంగళూరు జాతీయ రహదారుల వెంట పెద్దసంఖ్యలో మొక్కల్ని నాటినట్టు ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications