500 రోజుల్లో కేసీఆర్ సీఎం కావటం ఖాయం.. రాసిపెట్టుకోండి!
500 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈరోజు హైడ్రా ఎగ్జిబిషన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ భవన్లో హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కెసిఆర్ పాలనలో నగరంలో ఫ్లైఓవర్లు, అండర్పాస్ లు నిర్మించామని గుర్తు చేశారు.
హైడ్రాపై కేటీఆర్ విమర్శలు
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలోనే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందని, రాష్ట్రం నుంచి ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమివేసామని కేటీఆర్ తెలిపారు. హైడ్రా పెద్దవాళ్ళని వదిలిపెట్టి, పేదవాళ్ల నివాసాలను కూల్చి వేస్తోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. పేదల బాధ అందరికీ తెలియాలని తాము ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. పెద్దవాళ్లకు హైడ్రా నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క కొత్త నిర్మాణం లేదు
వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ తప్పనిసరిగా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో హైడ్రా బాధితులను ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్చివేతలు తప్ప ఒక కొత్త నిర్మాణం కూడా జరగలేదన్నారు. ftl పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామన్న హైడ్రా కమీషనర్ రంగనాథ్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లను కూల్చే ధైర్యం ఉందా అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.
వాళ్ళ ఇళ్ళు ఎందుకు కూల్చటం లేదు
మంత్రి వివేక్ ఇల్లు, రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ చెరువు మధ్యలో ఉందని కేటీఆర్ ఆరోపించారు. అరికపూడి గాంధీ కట్టడాలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. ఇక శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇల్లు చెరువు పక్కనే ఉందని పేర్కొన్న కేటీఆర్ పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అంటూ నిలదీశారు.
రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడితో అధికారులు భూమికి పెన్సింగ్ వేసారని కేటీఆర్ చెప్పారు. మూసీ నదిలో అడ్డంగా కట్టిన ప్రాజెక్టును మంత్రులు, అధికారులు ఎందుకు కూల్చలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్ లో బుల్డోజర్ వస్తే అడ్డుకుంటామని పేర్కొన్న రాహుల్ గాంధీ తెలంగాణలో బుల్డోజర్ పేదల ఇళ్లను కూలుస్తుంటే ఎందుకు మాట్లాడలేదని కేటీఆర్ నిలదీశారు. ప్రతిపక్షంలో ఉండగా కూల్చివేతలు తప్పన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కూల్చివేతలు ఎందుకు చేపట్టారో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications