ఢిల్లీ వెళ్లాల్సిన పనిలేదు.. ఖేల్ ఖతం.. దుకాణం బంద్!!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 'ఆపరేషన్' విజయవంతమైంది. దేశ రాజధాని హస్తినాపురం వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. రాజకీయంగా భారతీయ జనతాపార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఆయన భావిస్తున్నారు. ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి విలేకరుల సమావేశంలో బీజేపీ ఆపరేషన్ గురించి వెల్లడించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

బహిరంగసభలో అన్ని విషయాలు వెల్లడి?
ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాకు వ్యాపించడంతో భారతీయ జనతాపార్టీని కేసీఆర్ అన్నివైపుల నుంచి ముట్టడించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈనెల 30వ తేదీన కేసీఆర్ మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరులో నిర్వహించే బహిరంగసభలో పాల్గొననున్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను వెల్లడించాలనుకున్న అంశాలన్నింటినీ ఆయన ఆ సభలో తెలియజేసే అవకాశం ఉంది.

టీఆర్ఎస్ కు ఎంతో మేలు చేస్తుంది!
ఎమ్మెల్యేల అక్రమాస్తులకు సంబంధించి కూడా కేసీఆర్ మౌనం వీడతారని, అన్ని విషయాలను కూలంకుషంగా వివరించబోతున్నరాని తెలుస్తోంది.
వరుసగా రెండురోజులపాటు కేటీఆర్, హరీష్ రావు, ఇతర సీనియర్లతో కేసీఆర్ భేటీ అయ్యారు. 'ఆపరేషన్ ఆకర్ష్' పై పార్టీ నుంచి కూడా మంచి స్పందన వచ్చిందని, ఈ సంఘటన గులాబీ పార్టీకి ఎంతో మేలుచేసేదిగా ఆయన అభిప్రాయపడ్డారని సమాచారం. దీపావళి పర్వదినానికి ముందే ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించిన ఆడియోను కేసీఆర్ విన్నారంటున్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలుతో వ్యూహం మార్చిన కేసీఆర్
మునుగోడు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించిన తర్వాత రాష్ట్ర సాధారణ ఎన్నికలకు ముందస్తు వెళ్లే యోచన చేయవచ్చంటున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. మునుగోడులో గెలిస్తే ముందస్తుకు, లేదంటే యథావిధిగానే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో జరిగిన ఈ పరిణామంవల్ల భారత రాష్ట్ర సమితికి అంతా మంచి జరుగుతుందని కేసీఆర్ అభిప్రాయపడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సంఘటన బయటకు రాకపోతే కేసీఆర్ ఢిల్లీ వెళ్లేవారని, అక్కడ జాతీయ మీడియాతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంపై పోరును ప్రారంభించేవారని, ఎమ్మెల్యేల కొనుగోలుతో ఆయన వ్యూహం మార్చారంటున్నారు.












Click it and Unblock the Notifications