హరీష్ రావుకు వైద్య ఆరోగ్య శాఖ అప్పగించటం వెనుక కేసీఆర్ కొత్త వ్యూహం.. తెరమీదకు మళ్ళీ సీఎం పదవి !!
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ హుజురాబాద్ ఉప ఎన్నిక బాధ్యతలు తీసుకున్న మంత్రి హరీష్ రావుకు వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను అదనంగా కట్టబెట్టారు. సీఎం కేసీఆర్ హరీష్ రావుకు చెక్ పెడతాడని తెలంగాణ రాష్ట్రంలోనూ, ప్రతిపక్ష పార్టీలలో చర్చ జరుగుతున్న సమయంలో సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది .తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించి ప్రాధాన్యతను పెంచి ప్రతిపక్షాల విమర్శలను కెసిఆర్ తిప్పికొట్టడం పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

హరీష్ రావుకు సీఎం కేసీఆర్ ప్రయారిటీపై ఆసక్తికర చర్చ
సీఎం కేసీఆర్ ఏ పని చేసినా ఆచితూచి ఆలోచించి చేస్తారని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన నాటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రాన్ని టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ గా పాలన సాగించటం వెనుక కెసిఆర్ మంత్రాంగం ఉంది. రెండు దఫాలుగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి సీఎం కేసీఆర్ వ్యూహాలే ప్రధాన కారణమని కూడా ఒక టాక్ ఉంది. అయితే తాజాగా సీఎం కేసీఆర్ హరీష్ రావుకు అదనపు బాధ్యతగా వైద్య ఆరోగ్య శాఖను అప్పగించటం వెనుక కేటీఆర్‌ను సీఎం చేయాలనే ఆలోచన ఉందని, అందుకే హరీష్ రావు ప్రస్తుతం ప్రయారిటీ ఇస్తున్నారని చర్చ తెలంగాణ సమాజంలో జోరుగా జరుగుతోంది.

కేటీఆర్ ను సీఎం చెయ్యాలన్న కేసీఆర్ ఆలోచన
కేటీఆర్‌ను సీఎం చేయడం పక్కా అని , ఇది కేసీఆర్ మదిలో ఉన్న ఆలోచన అని ఎంతో కాలంగా తెలంగాణ ప్రజలలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఎప్పుడు కొడుకు కేటీఆర్ ను సీఎం చేయాలని భావించినా పరిస్థితులు అనుకూలించటం లేదు, ముహూర్తమూ కలసి రావడం లేదు. ఒకటి కాకపోతే ఒకటి ఆటంకం వస్తూనే ఉంది. ఆఖరికి యాదాద్రి ఘట్టం పూర్తవగానే ఈ తంతు కెసిఆర్ తెర మీదకు తెస్తాడని, అందుకోసమే హరీష్ రావుకు వైద్యశాఖ అదనపు బాధ్యతలు అప్పగించి ప్రయారిటీ ఇస్తున్నారని చర్చ జరుగుతుంది. కేటీఆర్ సీఎం కావడానికి ఎలాంటి అడ్డు లేకుండా చేసుకుంటూ పోతున్నాడని భావిస్తున్నారు.

హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించటం కోసమే హుజురాబాద్ ఉప ఎన్నిక బాధ్యత
టిఆర్ఎస్ పార్టీలో సామాన్యంగా కనిపించిన, అసామాన్యమైన వ్యక్తి ఈటలను పార్టీ నుండి బయటకు పంపించిన కేసీఆర్ ఎలాగైనా చిత్తుగా ఓడగొట్టాలనుకున్నాడు. బలమైన ఈటల రాజేందర్ మీద టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడానికి మంత్రి హరీష్ రావు ను రంగంలోకి దింపారు. మంత్రి హరీష్ రావు హుజూరాబాద్ నియోజకవర్గం లో రంగంలోకి దింపిన కేసీఆర్ వ్యవహారం మీద మొదటి నుంచి అనుమానం ఉంది. హరీష్ రావును కావాలనే ఓడిపోయే సీటు కోసం ప్రచారానికి పంపి.. ఆ తర్వాత ఓటమిని హరీష్ రావు ఖాతాలో వేస్తాడని హుజురాబాద్ ఎన్నికల సమయంలో ప్రచారం జరిగింది. టిఆర్ఎస్ పార్టీలో, తెలంగాణ సమాజంలోనూ హరీష్ రావు ప్రాధాన్యతను తగ్గించడం కోసమే రాజకీయంగా దూరం పెంచుతూ .. ప్రయార్టీ తగ్గిస్తాడని ప్రచారం ఉంది.

పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తూనే, హరీష్ దూరం కాకుండా కేసీఆర్ ఎత్తుగడలు
గతంలో కూడా కేసీఆర్ దుబ్బాక ఎన్నికల విషయంలో కూడా హరీష్ రావును రంగంలోకి దింపి ఓటమి పాలు కావడంతో హరీష్ రావు పై ప్రజలలో నమ్మకం పోయేలా చేశారు. ఇక తాజాగా హుజురాబాద్ ఎన్నికల ఓటమితో హరీష్ చరిష్మా పనిచేయదు అంటూ తేల్చి చెప్పారు. పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యతను తగ్గించి, పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేస్తే రాజకీయంగా ఇబ్బంది ఎదురవుతుందని భావించిన కేసీఆర్ ఎంతో తెలివైన అడుగు వేశారని చర్చిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఉన్నన్ని రోజులు వ్యతిరేకత వ్యక్తం కాదని, పార్టీలో ప్రాధాన్యాన్ని తగ్గిస్తూనే, తాను ప్రాధాన్యతనిస్తున్నట్లుగా చూపించాలని హరీష్ రావు కు కీలకమైన బాధ్యతలు అప్పచెప్పారని గుసగుసలాడుతున్నారు.

కేటీఆర్ సీఎం అయినా సరే ... కేసీఆర్ నిర్ణయాల దెబ్బకు హరీష్ రావు సైలెంట్
కేటీఆర్ సీఎం అయితే, హరీష్ రావు వేరు కుంపటి పెట్టి అసమ్మతి రాజేస్తే, పార్టీని రెండుగా విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలేవీ సాగకుండా ఉండేలా హరీష్ రావు ను కొద్దికొద్దిగా బలహీనం చేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత, హరీష్ రావు ప్రాధాన్యతను పెంచినట్లుగా ఉంటుందని మంత్రివర్గ విస్తరణ కంటే ముందుగానే ఆరోగ్యశాఖ హరీష్ రావుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హరీష్ రావు కు ఏ మాత్రం పార్టీలో ప్రాధాన్యత తగ్గలేదని చెప్పడం కోసమే కెసిఆర్ ఈ ప్రయత్నం చేసినా, హరీష్ రావు కిక్కురుమనకుండా నమ్మినబంటులా పడి ఉండాలి అన్న భావన కెసిఆర్ తీసుకున్న నిర్ణయంతో అర్థమవుతుంది.

సీఎంగా కేటీఆర్ అంటూ మరోమారు మొదలైన చర్చ .. హరీష్ కు ప్రాధాన్యత అందుకేనా?
భవిష్యత్తులో హరీష్ రావు కేటీఆర్ కు సహకరించడం కోసం, సీఎంగా కేటీఆర్ కు అవకాశం ఇస్తే హరీష్ రావు అంగీకరించటం కోసం సీఎం కేసీఆర్ ఆసక్తికరమైన ఎత్తుగడలు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు కాకపోతే కేటీఆర్ ను మళ్లీ సీఎం చేయలేడని, రాహుల్ గాంధీకి పట్టిన పరిస్థితి కేటీఆర్ కు పట్టకూడదని భావించి దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే నానుడిని నిజం చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని, హరీష్ రావుకి వైద్య ఆరోగ్య శాఖ కేటాయించడం వెనుక, సీఎంగా కేటీఆర్ ను చూడాలనే వ్యూహం ఉందని ఆసక్తికర చర్చ జరుగుతుంది. హరీష్ రావు కేసీఆర్ ప్రాధాన్యతను ఇవ్వడం వెనుక రకరకాల ఊహాగానాలు బయటకు వస్తున్నా, మరోమారు తాజాగా కేటీఆర్ సీఎం పదవి కట్టబెట్టడానికే అన్న చర్చ ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications