కేసీఆర్ వినూత్నం: 'హాలో నేను సీఎంను... వస్తున్నా'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి కాలనీ సాధకబాదకాలపై ఆరా తీయడంతో నాగోలు పరిధిలోని మమతానగర్ కాలనీ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఆదివారం సీఎం కేసీఆర్ కాలనీలో పర్యటించి అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీఎం తన కార్యాలయం నుంచి బుధవారం ఉదయం 10 గంటల సమయంలో మమతానగర్ కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డికి కేసీఆర్ ఫోన్ చేశారు. "హాలో నేను సీఎంను... మీ కాలనీకి వస్తున్నా, అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి" అని అడిగారు.

అంతేకాదు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారా... పారిశుధ్య పనులు చేపడుతున్నారా... డంపర్‌బిన్‌లు ఏర్పాటు చేశారా అంటూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు తాను వస్తానని, కాలనీలో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తానని సీఎం చెప్పినట్లు శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.
వెంకటరమణ కాలనీ అధ్యక్షునికీ ఫోన్:
వెంకటరమణ కాలనీ అధ్యక్షులు షౌకత్ హుస్సేన్‌కు కూడా సీఎం కేసీఆర్ ఫోన్ చేసి కాలనీలోని సమస్యలపై ఆరా తీశారని... ఆదివారం సాయంత్రం కాలనీకి వస్తున్నానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ వస్తుండటంతో మమతానగర్ కాలనీలో స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి పేరుకుపోయిన చెత్తను తొలగించారు.












Click it and Unblock the Notifications