కేసీఆర్ పద్మవ్యూహంలో చిక్కుకున్న నరేంద్రమోడీ, అమిత్ షా?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ వ్యూహాలను రచించడంలో వాటిని అమలు చేయడంలో గండర గండడుగా పేరు తెచ్చుకున్నారు. అటువంటి కేసీఆర్ అంత తేలిగ్గా అధికారాన్ని పోగొట్టుకుంటారనుకుంటే అది తేలికపాటి అభిప్రాయమే అవుతుంది. సహజంగా రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన పార్టీమీద రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవడం సహజంగా జరుగుతుంది. ఆ వ్యతిరేకతను అధిగమించి ముచ్చటగా మూడోసారి అధికారం చేజిక్కించుకోవడానికి కేసీఆర్ పద్మవ్యూహం పన్నారు.

తమలో తామే కలహించుకుంటున్న కాంగ్రెస్ నేతలు
కేసీఆర్ పన్నిన పద్మవ్యూహంలో బీజేపీ చిక్కుకొని గిలగిలలాడుతోంది. మూడోసారి అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ ను బలహీనం చేయాలని కేసీఆర్ భావించారు . పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. క్రమేణా ఆ పార్టీ నాయకులను, కార్యకర్తలను చేర్చుకుంటూ బలహీనపరుస్తూ వచ్చారు. అధికార పార్టీమీద యుద్ధం చేయాల్సిన కాంగ్రెస్ నేతలు తమలో తామే యుద్ధం చేసుకుంటున్నారు. కార్చిచ్చులా రాజుకున్న కాంగ్రెస్ నేతల విభేదాలు ఇప్పట్లో చల్లారే పరిస్థితి లేదు. ఆ బలహీనం చేసే ప్రక్రియలో కాంగ్రెస్ స్థానాన్ని తాము ఆక్రమించాలని బీజేపీ భావించింది.

కాంగ్రెస్ పార్టీకున్న క్షేత్రస్థాయి బలం బీజేపీకీ లేదు?
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకున్న నేతల బలంకానీ, కార్యకర్తల బలంకానీ బీజేపీకి లేదు. ఆ విషయం కేసీఆర్‌కు తెలుసు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయమే ఉంది. ఈ తక్కువ సమయంలో గ్రామ గ్రామాన కార్యకర్తలను, బూత్‌ల వారీగా నాయకులను నియమించుకొని 119 నియోజకవర్గాల్లో బలపడటం అంత సులభంగా జరిగే పనికాదు. ప్రజల్లో ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి తెలంగాణ సెంటిమెంట్ వారిని ఆలోచింప చేస్తుంది. తెలంగాణ ఉద్య మ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ ఎస్‌వైపు కాస్తంత మొగ్గు చూపుతారు. ఇవన్నీ బేరీజు వేసుకున్న కేసీఆర్ బీజేపీ నేతలు తనపై, తన పార్టీపై జరుపుతున్న యుద్ధాన్ని మౌనంగా చూస్తున్నారు. బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్లకు కూడా ఎటువంటి స్పందన వ్యక్తంచేయడంలేదు.

ఆలోచనలో పడ్డ బీజేపీ
దీంతో కేసీఆర్ వ్యూహం ఏమైవుంటుందా? అనే కోణంలో బీజేపీ నేతలు యోచిస్తున్నారు. కానీ అప్పటికే వారికి సమయం మించిపోయింది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన అత్యవసర పరిస్థితి వచ్చింది. ముందుగా బలమైన నాయకుల కోసం వేట ప్రారంభించారు.
కానీ వారికి కావల్సిన నేతలు దొరకలేదు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడేకొద్దీ బీజేపీ ఆ స్థాయిలో బలపడటంలేదని కేసీఆర్ గ్రహించారు. విమర్శలు, ప్రతివిమర్శలతో బీజేపీ కొంత బలపడినట్లు కనిపిస్తున్నపపటికీ నియోజకవర్గంలో ఆ పార్టీకి ఓటుబ్యాంకు ఏర్పడలేదు. ప్రత్యేకమైన ఓటుబ్యాంకు ఉంటేనే ఎన్నికల్లో ప్రభావితం చేయగలుగుతుంది.
అది లేకుండా ఏ వర్గాలమీద ఆధారపడినపపటికీ ప్రయోజనం ఉండదు. ఇవన్నీ గ్రహించే కేసీఆర్ జరుగుతున్న పరిణామాలను తనుకు అనుకూలంగా మలచుకునే పనిలో తలమునకలయ్యారు. చివరకు బీజేపీ పరిస్థితి అడకత్తెరో చిక్కుకున్న పోకచెక్కలా తయారైంది.!! తెలంగాణ సమరంలో ఎవరిది పైచేయి అనేది తేలాలంటే మరికొద్దిరోజులు వేచిచూడక తప్పదు.!!


Click it and Unblock the Notifications