ఎవరేమన్నా పట్టించుకోవద్దు: కెసిఆర్, మిషన్ కాకతీయ ట్రస్ట్‌కు కేంద్రం ఓకే
హైదరాబాద్: ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోవద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష సమావేశంలో సూచించారు. మనకు ప్రజలే బాస్ అని చెప్పారు.
టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం గురువారం జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో భేటీ జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై పార్టీ ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు.

అదేవిధంగా సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించాల్సిందిగా సీఎం సూచించారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు జనవరి నెలలో వచ్చే అవకాశముందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
వరంగల్ ఉప ఎన్నికల్లో 67 శాతం, నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో 52 శాతం విజయావకాశాలు మన పార్టీకే ఉన్నాయని చెప్పారు. కార్పోరేషన్ పదవులు ఎవరికి ఇవ్వాలే కేంద్ర పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. నలుగురు లేదా ఐదుగురు ఎమ్మెల్యేలకు కార్పోరేషన్ పదవులు రావొచ్చని చెప్పారు.

పది రోజుల్లో కమిటీలు వేయాలన్నారు. ప్రతిపక్షాల విమర్శలను ఎమ్మెల్యేలు బలంగా తిప్పికొట్టాలని చెప్పారు. దసరా నుంచి డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం ప్రారంభిస్తామన్నారు. మిషన్ కాకతీయలో బాగా పని చేస్తున్న నియోజకవర్గాలకు అదనంగా పది శాతం నిధులు ఇస్తామన్నారు.
మిషన్ కాకతీయకు విదేశీ సహాయం
మిషన్ కాకతీయ ట్రస్ట్ ద్వారా విదేశాల నుంచి విరాళాలు సేకరించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

విదేశాల నుంచి వచ్చే విరాళాలను ప్రభుత్వం మిషన్ కాకతీయ పనులకు వినియోగించనుందన్నారు. మొదటి దశ మిషన్ కాకతీయ ద్వారా గ్రామాల్లోని చెరువులు నిండుకుండలా మారాయన్నారు. కాగా, విదేశీ సాయం కోసం కేంద్రం నెంబర్ కేటాయించనుంది.












Click it and Unblock the Notifications