ఆ ఒక్కడి ఉద్యోగం ఊడగొట్టండి, ముఖ్యమంత్రి కోసం పోటీ: రేవంత్ రెడ్డి
వరంగల్: తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ మనిషి రక్తానికి మరిగిన పులి వంటి వాడని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని కేసీఆర్ ప్రశ్నించడం విడ్డూరమన్నారు. నాడు హోదా ఇవ్వాలని తెరాస కూడా చెప్పిందని గుర్తు చేశారు.
ఇప్పుడు హోదాను ఎత్తి వైషమ్యాలు రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికలు భావోద్వేగంతో జరిగాయన్నారు. కేసీఆర్‌కు రోజుకో కల వస్తోందని, అందుకే వందకు పైగా సీట్లు వస్తాయని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సినవి వస్తాయని చెప్పారు.

కేసీఆర్ చేతిలో మోసపోయామని భావిస్తున్నాం
కేసీఆర్ చేతిలో మోసపోయామని ప్రజలు భావిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ పదేపదే చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని, దీనిపై పునరాలోచన చేయాలని హితవు పలికారు.

కమీషన్లు, కబ్జాలకు పాల్పడే వారే తెరాస అభ్యర్థులు
కమీషన్లు, కబ్జాలకు పాల్పడే వారే తెరాస అభ్యర్థులుగా ఉన్నారని రేవంత్ ఆరోపించారు. కేసీఆఱ్ తన బంధువులకు ఓ న్యాయం, దళితులకు మరో న్యాయం చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నట్లుగా మాట్లాడుతున్నారని, గత ఉత్పత్తికి అదనంగా ఒక్క యూనిట్ కూడా ఇక్కడ ఉత్పత్తి కాలేదని చెప్పారు.

ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ
కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులలో ఉత్పత్తి ప్రారంభించారని రేవంత్ చెప్పారు. దేశంలో ఎక్కడా లేని ధరకు కేసీఆర్ విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి కోసం కేసీఆర్ కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నారని విమర్శించారు. తాము 103 సీట్లు, 106 సీట్లు గెలుస్తామని కేసీఆర్ చెబుతున్నారని, అన్ని సీట్లు గెలిస్తే ఇక రోజుకు ఎనిమిది సభలు ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు.

ఓడిపోతామనే ఇంటింటా ప్రచారం
తాము ఓడిపోతామనే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారని రేవంత్ అన్నారు. దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని చెప్పారని, ఆ హామీ ఏమయిందని ప్రశ్నించారు. కేసీఆర్ హామీలు ఒకటి, పాలన మరొకలా ఉందన్నారు. మిషన్ భగీరథను కాస్త కమీషన్ భగీరథగా మార్చారని చెప్పారు. రూ.38వేల కోట్ల ప్రాణహిత చేవెళ్లను రూ.1 లక్ష కోట్లకు పెంచారన్నారు. డబ్బు పంపిణీ చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని చెప్పారు. డబ్బులు తీసుకొని కేసీఆర్‌ను గెలిపిస్తే ఫాంహౌస్ నుంచి బయటకు రాడన్నారు. కేసీఆర్ పాలనలో లక్షన్నర కోట్ల అప్పులు తెచ్చారన్నారు.

ఒక్కడి ఉద్యోగం ఊడగొడితే
రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు దివాళా తీశాయని ములుగు ప్రచారంలో రేవంత్ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తామని చెప్పారు. మీరు ఒక్కడి ఉద్యోగం ఊడగొడితే.. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ బాధ్యత రేవంత్, సీతక్కది అన్నారు. 58 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రూ.4వేలు పింఛన్ ఇస్తామని చెప్పారు.

పారిపోయే కేటీఆర్ దత్తత తీసుకుంటారా?
ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేశారో కేసీఆర్ వివరించారని కొడంగల్‌లో రేవంత్ చెప్పారు. కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచుకోవడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. రేపటి రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలన్నారు. కొడంగల్ ప్రాంతాన్ని ఎండబెట్టింది కేసీఆరే అన్నారు. ఓడిపోతే పారిపోయే కేటీఆర్ కొడంగల్ దత్తత తీసుకొని ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. కొడంగల్‌లో తాను ఉన్నంత వరకు ఇటువైపు ఎవరూ చూసే సాహసం కూడా చేయరని చెప్పారు.












Click it and Unblock the Notifications