నేడు అసెంబ్లీకి KCR: తెలంగాణా బడ్జెట్ వేళ గులాబీ బాస్ ఎంట్రీపై ఉత్కంఠ!!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నేడు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. పార్లమెంటు ఎన్నికల సమీపిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి సంబంధించి కేటాయింపులే బడ్జెట్లో ఉన్నా ఏడాది మొత్తానికి అంచనాలను ప్రకటించే అవకాశం ఉంది.
ఇక నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నవేళ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఆయన అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో పాల్గొననున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా గత రెండు రోజుల నుంచి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు.

ఇక నేటి నుండి కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసిఆర్ తొలిసారిగా సమావేశాలకు హాజరు కావడంపై ప్రజలలో ఆసక్తి నెలకొంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ డిసెంబర్ 8వ తేదీన బాత్రూంలో జారి పడిపోయారు. ఆయన తుంటి ఎముక ఫ్రాక్చర్ కాగా, వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు.
అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేసీఆర్ చేతి కర్ర సహాయంతో నడుస్తున్నారు. ఇక ఈ నెల ఒకటవ తేదీన కర్ర సహాయంతోనే అసెంబ్లీకి వచ్చి గజ్వేల్ ఎమ్మెల్యేగా స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక రాష్ట్రంలో అధికార పార్టీపై దూకుడు కొనసాగించడానికి కెసిఆర్ నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు.
ఇక నేటి నుండి కేసీఆర్ సమావేశాలకు హాజరవుతున్న క్రమంలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను ఏ విధంగా డీ కొట్టబోతున్నారు . కెసిఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా జరగనున్న ప్రచ్చన్న యుద్ధంలో ఎవరిది పైచేయి అవుతుంది అన్నది ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications