కేసీఆర్ ఎలాంటివాడనేది కేంద్రమే స్పష్టం చేసింది: కేటీఆర్
కేసీఆర్ దార్శనికతతో కూడిన నాయకత్వాన్ని కేంద్రం ఒప్పుకుందని స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులపై మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా స్వచ్చ సర్వేక్షణ్ లో అవార్డుల పంట పండింది. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులలో టాప్ లో ఉండడం తెలంగాణ రాష్ట్ర మంత్రులకు, బీఆర్ఎస్ నేతలకు సంతోషం కలిగిస్తుంది. దేశంలో ఓడిఎఫ్ ప్లస్ లో మనమే నెంబర్ వన్ లో ఉన్నామని, దేశంలో అత్యధిక టాయిలెట్స్ ఉన్న ఐదు రాష్ట్రాలలో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందని, కేవలం 9 ఏళ్ల వ్యవధిలోని తెలంగాణ రాష్ట్రం పల్లె ప్రగతిలో అనుకున్న ప్రగతిని సాధించిందని తెలంగాణా మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లె సీమలు
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 4 తాజా సర్వేల్లో మరోసారి తెలంగాణ ప్రతిభ బయటపడిందని, ఓ డి ఎఫ్ ప్లస్ గ్రామాలు, ఇండ్ల విభాగాల్లో 100 శాతం స్వచ్చత సాధించిందని, మరోసారి దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లె సీమలు నిలిచాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దార్శనిక పథకం పల్లె ప్రగతి ద్వారానే ఇది సాకారం అయిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. అవార్డు ప్రకటించిన కేంద్రానికి, సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్, హరీశ్ రావు లకు మంత్రి ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలియజేశారు.

కేంద్రానికి ఎర్రబెల్లి చురకలు
పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో కేంద్రానికి చురకలు అంటించారు. అవార్డులు ఇవ్వటమే కాదు, నిధులు కూడా ఇవ్వాలంటూ మంత్రి ఎర్రబెల్లి కేంద్రాన్ని టార్గెట్ చేశారు. గతంలోనూ అనేక మార్లు స్వచ్చ సర్వేక్షణ్ లో తెలంగాణా రాష్ట్రానికి అనేక అవార్డులు, రివార్డులు వచ్చాయని, తెలంగాణా అభివృద్ధిని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఒప్పుకుంటుందని అన్నారు.
పని మాట్లాడుతుందన్న మంత్రి కేటీఆర్
ఇక ఓడిఎఫ్ ప్లస్ లో తెలంగాణ టాప్ లో ఉండడంపై రాష్ట్ర పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. నిజమైన పని మాట్లాడుతుందని, తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ గారి దార్శనిక నాయకత్వం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి గొప్ప ప్రయత్నాల కారణంగా కెసిఆర్ గారి ఆలోచనల కార్యక్రమం పల్లె ప్రగతి సక్సెస్ అయిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
డబుల్ ఇంజన్ కు డబుల్ పనికి తేడా ఇదే
తెలంగాణ మంత్రి హరీష్ రావు డబుల్ ఇంజన్ కు, డబుల్ పని చేస్తున్న సర్కార్లకు ఇదే తేడా అంటూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి దేశంలో టాప్ లో నిలిచిన తెలంగాణ పనితనాన్ని స్పష్టం చేశారు. దేశానికి ఆదర్శంగా మన పల్లె సీమలు నిలుస్తున్నాయని కొనియాడారు. కేంద్రం చేసిన సర్వే ప్రకారం ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలలో 100% ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి హరీష్ రావు.

స్వచ్చ సర్వేక్షణ్ లో టాప్ ఐదు రాష్ట్రాలలో తెలంగాణా : హరీష్ రావు
మెజారిటీ గ్రామీణ ప్రాంతాలలో ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రం అత్యధిక ప్రతిభ కనబరిచిన టాప్ ఐదు రాష్ట్రాలలో ఉందని మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ ఇంజన్ లా కాదు డబల్ పనిని నమ్ముతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు, పంచాయతీరాజ్ శాఖ అధికారులకు అభినందనలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications