వరంగల్ నేతలకు కీలక పదవులు: బిజెపి రాష్ట్ర కమిటీలో ఆ ముగ్గురు
వరంగల్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో వరంగల్ నేతలు ముగ్గురికి చోటు దక్కింది. ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని బుధవారం పునర్వ్యవస్థీకరించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి స్థానంలో బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కె.లక్ష్మణ్ తన బృందాన్ని ప్రకటించాల్సి ఉండగా తీవ్ర జాప్యం జరిగింది.
తాజా కార్యవర్గంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డాక్టర్ టి.రాజేశ్వర్‌రావుు, మార్తినేని ధర్మారావులను నియమించారు. గతంలోనూ వీరు ముగ్గురు రాష్ట్ర కమిటీలో ఉన్నారు. ప్రేమేందర్‌రెడ్డి ప్రధాన కార్యదర్శిగా, ధర్మారావు ఉపాధ్యక్షులుగా ఉండగా వీరి పదవుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌గా వ్యవహరించిన టి రాజేశ్వర్‌రావును ఈసారి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమించారు.
గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి:
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ప్రేమేందర్‌రెడ్డి వృత్తిరీత్యా న్యాయవాది. అడ్వకేట్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుకుగా పాల్గొని జిల్లా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. బిజెపి జిల్లా అధ్యక్షునిగా, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన కమిటీలో తిరిగి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీలో సౌమ్యుడిగా పేరు ఉంది. పార్టీ కోసం పూర్తి స్థాయిలో పని చేస్తున్నారు.

డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు:
భాజపాలో సీనియర్ నేత. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, నగర మేయర్‌గా పనిచేశారు. వృత్తిరీత్యా వైద్యుడు. హన్మకొండ బాలసముద్రంలో నివాసం, పార్టీకి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో భాజపా క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌గా పనిచేశారు. రాష్ట్ర, జాతీయ నాయకులతో మంచి సంబంధాలున్నాయి. మంచి వక్త. తెలంగాణ ఉద్యమంలోనూ చురుకుగా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియామకమయ్యారు.
మార్తినేని ధర్మారావు:
విద్యార్థి దశలో ఏబీవీపీలో క్రియాశీలంగా పనిచేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. హన్మకొండ రాంనగర్‌లో నివాసం. 1980లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ తీసుకున్నారు. ఏబీపీవీ హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సర్దార్ వల్లాబాయి పటేల్ కళాశాలలో విద్యార్థి సంఘం నాయకునిగా పని చేశారు. యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, భాజపా అర్బన్ జిల్లా అధ్యక్షునిగా సేవలందించారు. 1994లో జరిగిన ఎన్నికలలో హన్మకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications