నిరుద్యోగ భృతిపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు .. నిరుద్యోగుల స్పందన ఇదే !!
తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతిపై కీలక వ్యాఖ్యలు చేశారు . తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా శాసన సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో తాజా ఆర్థిక పరిస్థితులపై మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం 100 శాతం ప్రజల పక్షాన ఉంటుందని, రేషన్ కార్డులు, కొన్నిచోట్ల పెన్షన్ల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్న కేసీఆర్ అతి త్వరలో తప్పకుండా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు.

కరోనా గడ్డు పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి ఇవ్వటం సాధ్యం కాలేదు
57 ఏళ్ల పైబడిన వారికి కచ్చితంగా పెన్షన్ ఇస్తామని, వీటి విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. అయితే కరోనా కారణంగా రాష్ట్రంపై దాదాపు లక్ష కోట్ల రూపాయల భారం పడిందని పేర్కొన్న కెసిఆర్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆలోచన చేశామని, విధివిధానాలను రూపకల్పన చేసే సమయంలో కరోనా మహమ్మారి వచ్చిందని పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి కారణంగా ఆ సమయంలో ఉద్యోగులకు వేతనాలు సరిగ్గా ఇవ్వలేకపోయామని చెప్పిన కేసీఆర్, అలాంటి గడ్డు పరిస్థితులలో నిరుద్యోగ భృతి ప్రభుత్వానికి ఇవ్వడం సాధ్యం కాలేదని స్పష్టం చేశారు .

నిరుద్యోగ భృతిపై ఆలోచిస్తాం .. ఆందోళన వద్దు
నిరుద్యోగ భృతి పై రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తోందని, ఎవరు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ తాజా వ్యాఖ్యలతో నిరుద్యోగ భృతి ఇప్పట్లో లేనట్టే అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది.
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందిస్తామని గత ఎన్నికల ముందు తెలంగాణ సర్కార్ హామీ ఇచ్చింది. ఏళ్లు గడుస్తున్నా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారు.

కేసీఆర్ వ్యాఖ్యలతో నిరాశలో నిరుద్యోగులు
ఇదే సమయంలో ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో కూడా నిరుద్యోగ భృతి త్వరలోనే ఇస్తామంటూ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అప్పటి నుంచి ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత, తాజాగా అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో తీవ్ర నిరాశలో ఉన్నారు. నిరుద్యోగ భృతి పై ఆలోచన చేస్తామని చెప్పారే కానీ, కచ్చితంగా ఇప్పటివరకు నిరుద్యోగ భృతి అందిస్తామని కేసిఆర్ చెప్పలేదని , అటు ఉద్యోగాలు కల్పించక, ఇట్లు నిరుద్యోగ భృతి అందించక తెలంగాణ సర్కార్ యువత భవిష్యత్తుతో ఆటలాడుతోందని విమర్శిస్తున్నారు.
తెలంగాణా బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26 వరకు .. 18 న బడ్జెట్ : బీఏసీ నిర్ణయం