ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం టైమ్ ఫిక్స్.. రేపు రాత్రి వరకే దర్శనాలు..
హైదరాబాద్ లో గణేష్ నవరాత్రులు కోలాహలంగా జరుగుతున్నాయి. గల్లీ గల్లీకి గణేష్ మండపాలతో.. డీజే పాటలతో హోరెత్తుతున్నాయి. మరోవైపు గణేష్ నిమజ్జనాలు కూడా ఊపందుకున్నాయి. ఈ మేరకు జీహెచ్ ఎంసీ, పోలీస్ యంత్రాంగం అలాగే ఇతర ప్రభుత్వ శాఖలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక హైదరాబాద్ కా రాజా ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 25 వ తేదీ శుక్రవారం అనంత చతుర్దశి పర్వదినం సందర్భంగా ఖైరతాబాద్ మహా గణపతితోపాటు నగరవ్యాప్తంగా ఉన్న వేలాది విగ్రహాలు నిమజ్జన శోభాయాత్ర ఘనంగా సాగనుంది. గతేడాది మాదిరి కాకుండా ఈ సారి నిమజ్జనం ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక ఇప్పటికే 3 కార్పొరేషన్ల పరిధిలో లక్షకుపైగా విగ్రహాల నిమజ్జనాలు పూర్తయినట్లు సమాచారం.
ఇక ఖైరతాబాద్ వినాయకుడి దర్శనాలు సెప్టెంబర్ 23 వ తేదీ బుధవారం రాత్రితో ముగియనున్నాయి. ఈ మేరకు గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. అలాగే సెప్టెంబర్ 24 న షెడ్లు, బారికేడ్ల తొలగింపు తదితర కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. ఇక సెప్టెంబర్ 25 న ఉదయం 6 గంటలకు వినాయకుడిని భారీ ట్రక్కుపైకి ఎక్కించి మధ్యాహ్నం 12 గంటల వరకు శోభాయాత్రను అలాగే నిమజ్జనం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు గణేష్ ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. దీంతో భక్తులు బుధవారం రాత్రిలోపే బడా గణేష్ ను దర్శించుకోవాలని కోరింది. ఇక హైదరాబాద్ మొత్తం దాదాపు 1.5 లక్షల గణేష్ మండపాలు కొలువుదీరినట్లు సమాచారం. ప్రధాన నిమజ్జనం రోజున దాదాపు 50 లక్షల మంది భక్తులు శోభాయాత్రలో పాల్గొనే అవకాశం ఉందని భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి అంచనా వేసింది.

గణేష్ నిమజ్జనాల కోసం హుస్సేన్ సాగర్ తో పాటు సరూర్ నగర్, కాప్రా, అమీన్ పూర్ తో పాటు నగర వ్యాప్తంగా దాదాపు 150 కు పైగా ప్రాంతాల్లో వీటితో పాటు 110 బేబీ పాండ్స్ ను సైతం అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నిమజ్జనం వేళ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. గణేష్ నిమజ్జనం వేళ రద్దీని దృష్టిలో పెట్టుకుని నగర వ్యాప్తంగా 23 నుంచి 25వ తేదీ వరకు పలు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అలాగే మళ్లింపులు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు భక్తులు, వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలని.. ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
